World Cup Match: మ్యాచ్ కోసం బుకింగ్స్.. హోటల్ వద్దు హాస్పిటల్ ముద్దు

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కి ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లను చూడని వారు, క్రికెట్‌పై అంతగా ఇంట్రస్ట్‌ లేనివాళ్లు సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే ఆసక్తి చూపిస్తారు.

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 03:37 PM IST

ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సిరీస్‌లు లేని కారణంగా.. పెద్దపెద్ద టోర్నీల్లోనే రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు చూసే అవకాశం లభిస్తుంది. దీంతో దాయాదుల పోరుకు మరింత డిమాండ్‌ ఏర్పడింది. ఈ ఏడాది భారత్ లో వరల్డ్ కప్ జరగనుండడంతో భారత్- పాక్ మీద ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అహ్మదాబాద్ ఈ మ్యాచ్ కి వేదిక కానుండగా.. ఇప్పుడు అక్కడ అన్ని హోటల్ రూమ్స్ బుక్ అయిపోయాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఏకంగా హాస్పిటల్స్ బెడ్స్ బుక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సాధారణంగా పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఈ సారి ఆ హైప్ మరింత పెరగనుంది. దానికి కారణం వరల్డ్ కప్ మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. భారత్ తో మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ దాదాపు 7 ఏళ్ళ తర్వాత భారత్ లోకి అడుగుపెట్టబోతుంది.

చివరి సారిగా 2016 టీ 20 వరల్డ్ కప్ సందర్భముగా ఇరు జట్లు తలపడ్డాయి. ఇక 2021 టీ20 వరల్డ్ కప్‌, ఇండియాలో జరిగి ఉంటే హైదరాబాద్‌లో ఇండో- పాక్ మ్యాచ్ చూసే అవకాశం దక్కి ఉండేది. అయితే కరోనా కారణంగా ఆ టోర్నీని యూఏఈలో నిర్వహించాల్సి రావడంతో అభిమానులకి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో హోటల్ రూమ్స్‌కి విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. గతంలో 2 నుంచి 3వేలు ఉండే హోటల్ రూమ్ రెంట్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అహ్మదాబాద్ లోని రెంట్ ఇప్పుడు అక్షరాలా లక్ష రూపాయలకు పైగా పలుకుతోంది. 200-300 గదులు ఇచ్చే చిన్నాచితకా హోటల్స్‌ కూడా ఒక్క రోజుకి 20-30 వేల దాకా డిమాండ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

దీంతో ఇప్పుడు ఎలాగైనా మ్యాచ్ చూడాలనే ఉద్దేశ్యంతో క్రికెట్ అభిమానులు ఒక విచిత్రమైన పని చేస్తున్నారు. హోటల్ రూమ్ ఖర్చులు భరించలేక హాస్పిటల్ బిల్ కట్టడం నయం అన్నట్లు అవుతున్నారు. దీంతో ఇప్పుడు అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్‌కి విపరీతంగా గిరాకీ పెరిగింది. అక్టోబర్ 14-16 తేదీల్లో అహ్మదాబాద్ చుట్టుపక్కన ఆసుపత్రుల్లోని బెడ్స్ అన్నీ క్రికెట్ ఫ్యాన్స్‌తో నిండిపోబోతున్నాయి. ఇప్పటికే దీని గురించి సమాచారం ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్ మాట్లాడుతూ “గత రెండు మూడు రోజులుగా మాకు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అక్టోబర్ 15న ఫుల్ బాడీ చెకప్ కోసం ప్యాకేజీ కూడా ప్రకటించాం. మాతో పాటు చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులన్నీ ఆ అవకాశాన్ని వాడుకుంటున్నాయి”. అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి మరో మూడు నెలల ముందే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కి ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది.