MS Dhoni: ఒక సాధారణ ఆటగాడు కెప్టెన్ ఎలా అయ్యాడు

భారత లెజెండరీ కెప్టెన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్లేయర్ ఎంఎస్ ధోనీ. ఎవరూ ఊహించని విధంగా భారత జట్టు సారధ్య బాధ్యతలు అందుకున్న అతను.. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 01:37 PM IST

మూడు ఫార్మాట్లలో టీమిండియాను నెంబర్ వన్‌గా నిలిపాడు. తన హయాంలో ఉన్న ఐసీసీ ట్రోఫీలన్నీ ముద్దాడాడు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో 2007 వరల్డ్ కప్ ఆడిన భారత్ అత్యంత ఘోరమైన ప్రదర్శన చేసింది. దీంతో ద్రావిడ్ తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఇలాంటి సమయంలో సచిన్‌ను వన్డే పగ్గాలు తీసుకోవాలని బీసీసీఐ కోరిందట. ఈ రిక్వెస్ట్‌కు మర్యాదగా నో చెప్పిన సచిన్.. ధోనీ పేరును రికమెండ్ చేశాడట. అప్పటికి టీ20 వరల్డ్ కప్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతనికి వన్డే పగ్గాలు ఇవ్వాలా? వద్దా? అని సెలెక్టర్లు ఆలోచనలో పడ్డారట.

ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ గెలవడానికి ముందే ధోనీకి వన్డే కెప్టెన్సీని అప్పగించేశారు. దీనిపై అప్పటి చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. కేవలం సచిన్ చెప్పాడనో, సౌతాఫ్రికాలో టీ20 వరల్డ్ కప్ గెలిచాడనో ధోనీకి జట్టు సారధ్య బాధ్యతలు ఇవ్వలేదని దిలీప్ తెలిపాడు. ధోనీలో ఉన్న నాయకత్వ లక్షణాలు చూసిన తర్వాతనే అతనికి కెప్టెన్సీ ఇచ్చామని చెప్పాడు.’ఏదో ఆటోమేటిక్ చాయిస్ కదా అని కెప్టెన్సీ ఇవ్వడం జరగదు. ఒక ప్లేయర్ క్రికెటింగ్ సత్తా, బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుండి నడిపించే లక్షణం, ఆటగాళ్లను మేనేజ్ చేసే విధానం అన్నీ చూడాలి.

మ్యాచ్‌లో ధోనీ అప్రోచ్, బాడీ లాంగ్వేజ్, మిగతా వాళ్లతో అతను ఎలా మాట్లాడతాడు? అన్నీ మేం గమనించాం. అన్ని విషయాల్లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ వెల్లడించాడు. ఆ తర్వాత ధోనీని కెప్టెన్‌గా సెలెక్టర్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తును మార్చేసింది. 2008లో ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో అనిల్ కుంబ్లే రిటైర్ అవగానే ధోనీకి టెస్టు జట్టు పగ్గాలు కూడా అందించారు. మూడేళ్ల తర్వాత 2011 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టుకు కూడా ధోనీనే కెప్టెన్. అనంతరం 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా భారత్ నెగ్గింది. ఈ మధ్యలోనే టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా ఎదిగింది.