ఐపీఎల్ 17వ (IPL 17) సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్‌తో (Lucknow Supergiants) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో (Chinna Swamy Stadium) 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. లక్నో విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాపార్డర్ విఫలం కాగా.. బాధ్యత తీసుకోవాల్సిన నాలుగో నంబర్ బ్యాటర్ మాక్స్ వెల్ చేతులెత్తేశాడు. లక్నో యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwari) మాక్స్‌వెల్ గురించి మాట్లాడాడు. ఈ సీజన్ లో మాక్స్‌వెల్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పేర్కొన్నాడు. అంచనాలకు తగ్గట్లు ఒక్కసారి కూడా రాణించడం లేదని.. కోట్లకు కోట్లు మాత్రం తీసుకుంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
సరైన సమయానికి జీతం తీసుకుంటాడనీ, అదే స్థాయిలో ఆట మాత్రం ఆడలేకపోతున్నాడనీ ఫైర్ అయ్యాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో అతడి ట్రాక్ రికార్డు చూసినట్లయితే, పంజాబ్ ఫ్రాంఛైజీకి ఆడినపుడు కూడా ఇలాగే ఉండేవాడన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే తుస్సుమనిపించేవాడనీ, అతడి ఆటలో నిలకడలేదన్నాడు. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుంటే మంచిదంటూ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. కాగా ఆర్సీబీ రూ. 11 కోట్లకు మాక్సీని రిటైన్ చేసుకుంది.