ఐపీఎల్ , వన్డే ఫార్మాట్ లో నిలకడగా ఆడే టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ అంతర్జాతీయ టీ ట్వంటీల్లో మాత్రం ఎందుకో స్థాయికి తగినట్టు రాణించలేకపోతున్నాడు. ఈ కారణంగానే టీ20 వరల్డ్ కప్ టీమ్ లో చోటు కూడా దక్కలేదు. అయితే గంభీర్ కొత్త కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వన్డే, టీ ట్వంటీ టీమ్స్ కు గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీ ట్వంటీ ఫార్మాట్ కు సంబంధించి తన పేలవ ఫామ్ పై గిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంచనాలకు తగ్గట్లుగా తాను ఆడట్లేదని అంగీకరించాడు. అయితే వచ్చే టీ20 వరల్డ్ కప్‌లోపు మెరుగైన ప్లేయర్‌గా మారతానని గిల్ చెప్పుకొచ్చాడు. సరైన ఫామ్ లో లేకపోవడం వల్లనే వరల్డ్ కప్ టీమ్ కు ఎంపిక కాలేదన్నాడు.
జింబాబ్వే పర్యటనలో కెప్టెన్ గా వ్యవహరించిన గిల్ ఆ బాధ్యతలపైనా మాట్లాడాడు. కెప్టెన్‌గా ఎంపికైనా బ్యాటర్‌గా తన బాధ్యతల్లో ఎలాంటి ప్రత్యేక మార్పులు ఉండవని చెప్పాడు. క్రీజులో అడుగుపెట్టిన తర్వాత జట్టు, దేశం కోసం మ్యాచ్‌లు గెలవాలని ప్రదర్శన చేస్తానన్నాడు. ఇక యశస్వీ జైస్వాల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించడాన్ని ఎంతో ఆస్వాదిస్తానన్న గిల్ రైట్-లెఫ్ట్ కాంబినేషన్ కూడా బాగుంటుందన్నాడు. తామిద్దరం వచ్చే ప్రపంచకప్ లోపు అద్భుతమైన ఓపెనింగ్ పెయిర్ గా
మారతామని హామీ ఇచ్చాడు.