ODI World Cup: మేము చెప్పినట్టే చేయండి.. ఇండియా పిచ్‌లపై ఐసీసీ..

ఉపఖండ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. పేసర్ల కంటే కూడా స్పిన్నర్లు ఉపఖండ పిచ్‌లపై రాణిస్తారు. వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుండటంతో స్పిన్నర్లు పండగ చేసుకుంటారని అంతా అనుకున్నారు.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 02:27 PM IST

ODI World Cup: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మొత్తం 10 వేదికల్లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగుతుండటంతో మన జట్టు అదరగొడుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ఐసీసీ హెడ్ క్యూరేటర్ ఆండీ అట్కిన్సన్ పిచ్‌ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో జరిగిన సమావేశంలో స్పోర్టింగ్ పిచ్‌లను తయారు చేయాల్సిందిగా క్యూరేటర్లను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఉపఖండ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. పేసర్ల కంటే కూడా స్పిన్నర్లు ఉపఖండ పిచ్‌లపై రాణిస్తారు. వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుండటంతో స్పిన్నర్లు పండగ చేసుకుంటారని అంతా అనుకున్నారు. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో ఆతిథ్యమిచ్చే జట్టుకు హోమ్ అడ్వాంటేజ్ ఉండకూడదనే భావనలో అట్కిన్సన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లాట్ వికెట్‌లను.. లేదా స్పిన్నర్లకు అనుకూలించే వికెట్లను కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్‌కు సమానంగా అనుకూలించే పిచ్‌లను తయారు చేయాలని అట్కిన్సన్ క్యూరేటర్లను కోరినట్లు సమాచారం. 2011 నుంచి 2019 వరకు ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన జట్టే విజేతగా నిలిచింది.

2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా వన్డే ప్రపంచకప్‌కు అతిథ్యమివ్వగా.. భారత్ చాంపియన్‌గా నిలిచింది. 2015 వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరగ్గా.. ఆసీస్ విజేతగా నిలిచింది. ఇక 2019 వన్డే ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరగ్గా.. ఆ జట్టే చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో 2023 వన్డే ప్రపంకచప్‌లో భారత్ విజేతగా నిలుస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో ప్రపంచకప్ ముగియనుంది.