World Cup: వరల్డ్ కప్ రీ షెడ్యూల్

అక్టోబర్, నవంబర్ మాసాల్లో భారత్ గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. మెగా టోర్నీలో పాల్గొనే పలు జట్ల అభ్యర్థనతో పాటు సెక్యూరిటీ ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 03:52 PM IST

ఈ వివరాలను అటు ఐసీసీ కానీ ఇటు బీసీసీఐ అధికారికంగా ప్రకటించకున్నా.. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్స్ ప్రపంచకప్ రిషెడ్యూల్ తేదీలను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఐసీసీ ఇదివరకే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అక్టోబర్ 15 నవరాత్రి ఉత్సవాల ప్రారంభం నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బీసీసీఐ రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తారని, ఆ సమయంలో భారత్-పాక్ మ్యాచ్‌కు సెక్యూరిటీ కల్పించలేమని పోలీసులు బీసీసీఐకి స్పష్టం చేశారు. దాంతో ఉన్నపళంగా సమావేశం అయిన బీసీసీఐ.. ఇండో-పాక్ మ్యాచ్‌ను ఒకరోజు ముందుగా అక్టోబర్ 14న రీషెడ్యూల్ చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు హైదరాబాద్ వేదికగా జరగనున్న పాకిస్థాన్-నెదర్లాండ్, పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌ల తేదీల్లోనూ స్వల్ప మార్పులు జరిగాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 6న, పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10న జరగనున్నాయి. నేడు రీషెడ్యూల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రపంచకప్ 2023 నూతన షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం సాయంత్రం రిలీజ్ చేయనుందని తెలుస్తోంది.