Mohammed Siraj: టోలిచౌకి నుంచి నెంబర్ వన్ బౌలర్‌గా ఎదిగిన సిరాజ్..!

2023 ఆసియా కప్‌లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడం ద్వారా సిరాజ్‌ అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. సిరాజ్ ఖాతాలో ప్రస్తుతం 694 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా గత మార్చిలో సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 06:35 PM IST

Mohammed Siraj: హైదరాబాద్ గల్లీ బాయ్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచ నంబర్ వన్ వన్డే బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. 2023 ఆసియా కప్‌లో 12.2 సగటుతో 10 వికెట్లు తీయడం ద్వారా సిరాజ్‌ అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. సిరాజ్ ఖాతాలో ప్రస్తుతం 694 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా గత మార్చిలో సిరాజ్ అగ్రస్థానంలో నిలిచాడు. కొలంబోలో జరిగిన 2023 ఆసియా కప్‌లో శ్రీలంకపై మహ్మద్ సిరాజ్ చెలరేగిన విషయం తెలిసిందే.

ఒకే ఓవర్లో నాలుగు వికెట్స్ తీయడంతో పాటు మొత్తంగా 6 వికెట్స్ పడగొట్టాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. 51 పరుగులు లక్ష్యాన్ని సునాయాసంగా చేధించిన ఇండియా మరోసారి ఆసియా కప్ గెలిచింది. సిరాజ్ బౌలింగ్ ప్రదర్శన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకేలా చేసింది. దాంతో స్టార్ పేసర్లు జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, మిచెల్ స్టార్క్‌ను అధిగమించి టాప్‌లోకి దూసుకొచ్చాడు. హేజిల్‌వుడ్, బౌల్ట్ 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్ 10లో 638 రేటింగ్ పాయింట్లతో కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో ఉన్నాడు.