Rishabh Pant: తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకుల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆడుతున్న వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. యాక్సిడెంట్ కారణంగా ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్‌కు టాప్ టెన్‌లో చోటు దక్కింది.
అతను పదో ర్యాంకులో ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విఫలమైన విరాట్ కోహ్లీ మరో ర్యాంకు దిగజారి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. అతనిలాగే ఫెయిలైన ఛటేశ్వర్ పుజారా 25వ ర్యాంకులో ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లోనే ఉన్నారు. రోహిత్ శర్మ 12వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక తొలి యాషెస్ టెస్టులో తేలిపోయిన ఆసీస్ బ్యాటర్లు కూడా తమ ర్యాంకులు కోల్పోయారు. ఈ మ్యాచ్‌కు ముందు టెస్టు బ్యాటర్లలో తొలి మూడు స్థానాలను ఆసీస్ ప్లేయర్లే ఆక్రమించారు.
అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచినా కూడా వాళ్ల ర్యాంకులు దిగజారాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ స్టార్ జోరూట్ మొత్తం 887 రేటింగ్ పాయింట్లతో తొలి ర్యాంకును తన కైవసం చేసుకున్నాడు. ఇక భారత ఆటగాళ్లు వెస్టిండీస్ పర్యటనలో రాణించి, తమ ర్యాంకులు మెరుగుపరచుకుంటారేమో చూడాలి.