World Cup 2023: వరల్డ్‌కప్‌లో శనివారం జరిగే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సారి పాకిస్థాన్‌ని మట్టికరిపించే మొనగాడు ఎవరా అని లెక్కలు వేస్తున్నారు. కోహ్లీ అంటే పాకిస్థాన్ టీమ్‌కి వెన్నులో వణుకు. గెలిచేశాం అని అనుకున్న మ్యాచ్‌లను, ఇక ఇండియా గెలుపు అసాధ్యం అని భావించిన మ్యాచ్‌లను ఒంటి చేత్తో దాయాది జట్టుకు విక్టరీ దూరం చేసిన ప్లేయర్ కోహ్లీ. అందుకే కోహ్లీ అంటే పాకిస్థాన్ టీమ్‌కి భయం. వారి ఫ్యాన్స్‌కు మాత్రం ఇష్టం. ఐసీసీ టోర్నమెంట్లలో పాక్‌పై తలపడ్డ ప్రతిసారి కోహ్లీ ఆటపైనే ఎక్కువగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రేపు పాకిస్థాన్‌తో జరగనున్న వరల్డ్‌కప్ ఫైట్‌లోనూ పాక్‌పై కోహ్లీ ఆధిపత్యం ప్రదర్శిస్తాడని అంచనా వేస్తున్నారు.
ఇక 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. పాక్‌కు చెమటలు పట్టించి ఇండియాను గెలిపించాడు. దీంతో రేపటి మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడా.. రోహిత్ సెంచరీ చేస్తాడా అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. పనిలోపనిగా గతంలో వరల్డ్‌కప్ టోర్నీలో పాక్‌పై ఇండియా తలపడినప్పుడు హీరోలుగా నిలిచిన ఆటగాళ్లను గుర్తు చేసుకుంటున్నారు. వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా పాకిస్థాన్‌పై ఏడు సార్లు ఫైట్ చేసింది. ఈ ఏడు సార్లు కూడా ఇండియానే విక్టరీ కొట్టింది. ఈ ఏడు సార్లలో మూడు సార్లు పాకిస్థాన్ తుక్కురేగొట్టాడు సచిన్. 1992, 2003, 2011 వరల్డ్‌కప్‌ల్లో ఇండియాని గెలిపించింది సచినే. ఈ మూడు సార్లు కూడా సచిన్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది 2003 ప్రపంచకప్ మ్యాచే. శివరాత్రి రోజు జరిగిన ఆ మ్యాచ్‌లో సచిన్ శివతాండవం చేశాడు. అక్తర్, అక్రమ్, వకార్ త్రయాన్ని ఫేస్ చేయాలంటేనే భయపడే బ్యాటర్లు ఉన్న ఆ రోజుల్లో సచిన్ ఈ ముగ్గురిని ఉతికి ఆరేశాడు.
టీ20లు పుట్టని కాలంలోనే మెరుపు బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లను చీల్చిచెండాడిన మ్యాచ్ అది. ఈ మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో సచిన్ సెంచరీ మిస్ అయినా.. అతని కెరీర్‌లో మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. 2011లో పాక్‌పై పోరులోనూ పిచ్ కండిషన్స్‌కి తగ్గట్టుగా 85 పరుగులు చేసిన సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక సచిన్ వారసత్వాన్ని కంటిన్యూ చేసిన కోహ్లీ 2015 ప్రపంచకప్‌లో దుమ్మురేపాడు. 126 బంతుల్లో 107 పరుగులు చేసిన కోహ్లీ పరిస్థితులకు తగ్గట్టుగా టీమిండియా బ్యాటింగ్‌ని ముందుండి నడిపించాడు. కోహ్లీకి ధావన్ అద్భుతమైన సహకారం అందించాడు. ఇక 2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పాక్‌పై విశ్వరూపం చూపించాడు. కోహ్లీ సహకారంతో అద్భుతమైన పార్టనర్‌షిప్ నెలకొల్పిన రోహిత్.. టీ20 తరహా స్ట్రైక్ రేట్‌తో సెంచరీ బాదాడు. 113 బంతుల్లో ఏకంగా 140 రన్స్ చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో రోహిత్ రికార్డు సెంచరీ చేయగా.. రేపటి మ్యాచ్‌లోనూ రోహిత్ రెచ్చిపోతాడని టీమిండియా ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.