బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ ను 2-0తో వైట్ వాష్ చేసిన టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో తమ టాప్ ప్లేస్ ను మరింత పటిష్టంగా చేసుకుంది. నిజానికి కాన్పూర్ టెస్టులో భారత్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. వర్షంతో రెండున్నర రోజుల ఆట రద్దవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసి బంగ్లాదేశ్ తో పాయింట్లు పంచుకోవాల్సి వస్తుందని అంతా భావించారు. అయితే గంభీర్, రోహిత్ దూకుడైన స్కెచ్ తో బంగ్లాను చిత్తుగా ఓడించి సిరీస్ ను వైట్ వాష్ చేసేశారు. ఫలితంగా 12 పాయింట్లు సొంతం చేసుకుని విజయాల శాతం కూడా పెంచుకుంది. ప్రస్తుతం భారత్ 11 మ్యాచ్ లు ఆడి 8 విజయాలు, 2 ఓటమి, 1 డ్రాతో అగ్రస్థానంలో ఉంది. 74.24 గెలుపు శాతంతో టాప్ ప్లేస్ లో ఉన్న భారత్ ఈ సీజన్ లో మరో 8 టెస్టులు ఆడాల్సి ఉంది.
న్యూజిలాండ్ తో 3 , ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ లు ఆడనున్న టీమిండియా వీటిలో నాలుగు గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుతుంది. కాగా 62.5 విజయాల శాతంతో ఆసీస్ రెండో స్థానంలో ఉండగా… కివీస్ పై సిరీస్ గెలిచిన శ్రీలంక అనూహ్యంగా మూడో ప్లేస్ కు దూసుకొచ్చింది. భారత్ కు ఫైనల్ బెర్త్ దక్కడం దాదాపుగా ఖాయంగానే భావిస్తున్నారు. మిగిలిన బెర్త్ కోసం ఆసీస్, కివీస్, శ్రీలంక రేసులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడతాయని భావిస్తున్నారు. గత రెండు పర్యాయాలు రన్నరప్ తో సరిపెట్టుకున్న భారత్ ఈ సారి ఖచ్చితంగా డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.