World Cup: ఐదో స్థానం కోసం అలకలు.. కీపర్ కొలువులో ఎవరు బెటర్?

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతుండటంతో ఈసారి టీమిండియా చాంపియన్ గా నిలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 03:14 PM IST

మెగా ఈవెంట్ కోసం టీమిండియా ఇప్పటికే సన్నాహకాలను మొదలు పెట్టేసింది. రాబోయే రెండు నెలల పాటు తీరిక లేని షెడ్యూల్ తో టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. గాయాలతో క్రికెట్ కు దూరంగా ఉన్న కీలక ప్లేయర్లు ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్ నెస్ సాధించి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. జస్ ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లు ఆసియా కప్ నాటికి పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉంది.

ప్రపంచకప్ ఆడే జట్టుపై కోచ్ ద్రవిడ్ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. ఒకటి రెండు స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో ఎవర్ని తీసుకోవాలనే విషయంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ క్లారిటీగా ఉంది. రిషభ్ పంత్ గాయంతో ఈ ఏడాది క్రికెట్ ఆడేది అనుమానమే. దాంతో వికెట్ కీపర్ స్లాట్ ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ప్రపంచకప్ లో వికెట్ కీపర్లుగా ఎవర్ని తీసుకోవాలి అనే అంశంపై సెలెక్షన్ కమిటీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. వికెట్ కీపర్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రేసులో ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్ ల మధ్య వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఉంది.

ఈ ముగ్గురిలో ఇద్దర్ని ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లు ముందు వరుసలో ఉన్నారు. అయితే కేఎల్ రాహుల్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆసియా కప్ నాటికి అతడు పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉంది. అయితే అతడి తాజా ఫామ్ పేలవంగా ఉంది. ఇక ఇషాన్ కిషన్ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్టర్లకు ఉన్న మూడో ఆప్షన్ సంజూ సామ్సన్. అయితే అతడికి అవకాశం ఇచ్చేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే, గత ఏడాది కాలంగా రాహుల్, ఇషాన్ కిషన్, పంత్ కంటే కూడా సంజూ సామ్సన్ మెరుగ్గా రాణించాడు. అయినప్పటికీ అతడికి టీమిండియా తరఫున చాలా తక్కువ అవకాశాలు దక్కాయి. దీనిని బట్టి ప్రపంచకప్ కోసం వికెట్ కీపర్లుగా రాహుల్, ఇషాన్ కిషన్ లనే ఎంపిక చేసే అవకాశం ఉంది. స్టాండ్ బై ప్లేయర్ గా సంజూ సామ్సన్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది.