Virat Kohili: 76వ సెంచరీ చేస్తావా?

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇద్దరూ అద్భుతంగా ఆడారు. జైస్వాల్ భారీ శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 02:16 PM IST

ఇక రోహిత్ తను ఫామ్ అందుకున్నట్లు నిరూపించుకున్నాడు. వీరితోపాటు మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. కానీ తన 76వ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీకి చాలాసార్లు లైఫ్ లు లభించాయి. అతను ఇచ్చిన క్యాచులను విండీస్ ప్లేయర్లు నేలపాలు చేశారు. కానీ చివరకు చెత్త షాట్ ఆడిన అతను పెవిలియన్ చేరాడు. అప్పటికి అతని స్కోరు 76 కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు జైస్వాల్‌తో కోహ్లీ 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో 99 పరుగుల కీలక భాగస్యామ్యం నెలకొల్పాడు కోహ్లీ.

ఈ క్రమంలోనే 182 బంతుల్లో ఐదు బౌండరీలో సాయంతో 76 పరుగులు చేశాడు. ఆ తర్వాత కార్న్‌వాల్ బౌలింగ్‌లో లెగ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లీ 76వ సెంచరీ కోసమే కాదు.. ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న అతని ఓవర్సీస్ సెంచరీ కోసం ఫ్యాన్స్ మరింత వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ గెలిచినా కూడా కోహ్లీని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.టెస్టుల్లో ఇప్పటి వరకు 28 శతకాలు చేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా తన 29వ టెస్టు సెంచరీ పూర్తి చేస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అది జరగలేదు. దీంతో వెస్టిండీస్ మీద కూడా ఆడలేకపోయాడంటూ అతన్ని విమర్శిస్తున్నారు. అన్నిసార్లు లైఫ్ దక్కినా కూడా సెంచరీ పూర్తి చేయలేకపోయాడని కోహ్లీని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. మరి రెండో టెస్టులో అయినా అతను ఈ ఎదురు చూపులకు బ్రేక్ వేస్తాడేమో చూడాలి.