WTC final: బిల్డప్‌ ఎక్కువ..బిజినెస్‌ తక్కువ! మీ కంటే అతనే నయమంటూ రోహిత్‌, కోహ్లీపై ట్రోల్స్!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 296పరుగులకు ఆలౌటైంది. రహానే,శార్దూల్‌ థాకూర్‌ పుణ్యామా అని ఫాలో అన్‌ నుంచి గట్టెక్కింది. అటు రోహిత్,కోహ్లీ ఆటతీరుపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 07:06 PM IST

‘టీమిండియా అసలైన బ్యాటింగ్‌ ఆరో నంబర్‌ స్థానం నుంచి మొదలవుతుంది’..ఇది మూడేళ్లుగా మన టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ఎక్కువగా అభిమానులు యూజ్‌ చేస్తున్న వ్యాఖ్య! అది అక్షరాల నిజమైన, నిజమవుతున్న వ్యాఖ్య! మరోసారి అదే నిజం అని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌ నిరూపించింది. టాప్‌ ఫోర్ బ్యాటర్లు అట్టర్‌ ఫ్లాప్‌ అయిన చోట..ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శార్దూల్‌ థాకూర్‌ ఈజీగా బ్యాటింగ్‌ చేశాడు.

రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ కలిపి ఆడిన బంతుల సంఖ్య 97.. శార్దూల్ థాకూర్‌ ఒక్కడే ఆడిన సంఖ్య 109. ఆ నలుగురు కలిపి చేసిన పరుగులు 56.. థాకూర్‌ ఒక్కడే చేసిన పరుగులు 51. ఇది స్పెషాలిస్ట్‌ బ్యాటర్లకు, ఓ సాధారణ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు చేసిన కంపేరిజన్‌. ఇక్కడే అర్థమవుతుంది. మన బ్యాటర్ల గొప్పతనం ఏంటో. ఏదో బ్యాటింగ్‌ పిచ్‌లు తయారు చేసుకున్నామా.. ఐపీఎల్‌లో అంతర్జాతీయ స్థాయి అనుభవం లేని బౌలర్లపై బౌండరీలు బాదామా అన్నట్టుంది కోహ్లీ పరిస్థితి. మరోవైపు గతేడాది ఇంగ్లండ్‌ గడ్డపై మెరుపులు మెరిపించిన రోహిత్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 15పరుగులకే అవుట్ అయ్యాడు. అందరూ ఐపీఎల్‌ ఆడుతుంటే ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతూ అదరగొట్టిన పుజారా కూడా నిరాశపరిచాడు. అటు యువ సంచలనం గిల్‌ ఓ అద్భుతమైన బంతికి బొక్క బోర్లా పడ్డాడు. అసలు బాల్ గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన గిల్‌ ఘోరంగా అవుట్‌ అయ్యాడు.

అందరూ వేరు.. ఆ ఒక్కడు వేరు:
భారత్‌ టాప్‌ ఫోర్ బ్యాటర్లు విఫలమైన చోటా అజింక్య రహానే మెరిశాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎలా ఫేస్‌ చేయాలో చూపించాడు. పటిష్ట బౌలింగ్‌ డిపార్టమెంట్‌ని క్లూ లేస్‌గా చేసిన రహానే ఈ మ్యాచ్‌లో థాకూర్‌తో కలిసి టీమిండియాను ఫాలో అన్‌ గండం నుంచి గట్టెక్కించాడు. 89పరుగులు చేసిన రహానే ఈ మ్యాచ్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. టెస్ట్ కెరీర్‌లో 5,000 పరుగులు మెయిలు రాయిని అందుకున్నాడు. ఇండియా తరపున టెస్ట్‌లలో ఆ ఘనతను సాధించిన 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. థాకూర్, రహానే పట్టుదల బ్యాటింగ్‌తో టీమిండియా 296పరుగులు చేయగలిగింది. అంటే ఆస్ట్రేలియాకు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు కావడంతో మరో రెండు రోజులు ఆట మిగిలి ఉంది. ఇప్పటికైతే మ్యాచ్‌ ఆస్ట్రేలియా చేతులోనే ఉంది కానీ..మన బౌలర్లు టపటపా వికెట్లు తీసి.. ఆస్ట్రేలియాను 150లోపు ఆలౌట్ చేస్తే అప్పుడు మన టార్గెట్‌ 300 పరుగులకు అటు ఇటుగా ఉంటుంది. ఇది ఛేజ్‌ చేయడానికి కష్టమైనా అసాధ్యమేమీ కాదు..అయితే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆడినట్టు కాకుండా కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకొని టాప్‌ ఫోర్‌ బ్యాటర్లు ఆడితే గెలవచ్చు..దాని కంటే ముందు ఆస్ట్రేలియా 150లోపు ఆలౌట్‌ అవ్వాలి కదా!