మళ్ళీ తిప్పేస్తారా ? వైట్ వాష్ టార్గెట్ గా భారత్

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మొదలుకాబోతోంది.

  • Written By:
  • Publish Date - September 26, 2024 / 05:26 PM IST

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మొదలుకాబోతోంది. చెపాక్ స్టేడియంలో 280 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా ఇప్పుడు 2-0తో సిరీస్ కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈ మ్యాచ్ కు సంబంధించి భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. తొలి టెస్ట్‌కు రెడ్ సాయిల్ పిచ్‌ను సిద్దం చేయగా.. ఈ వికెట్‌ పేస్ బౌలింగ్‌తో పాటు స్పిన్‌కు సహకరించింది. మధ్యలో బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగా మారింది. కానీ బ్లాక్ సాయిల్ పిచ్‌ పూర్తిగా స్పిన్నర్లకు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికెట్‌పై బౌన్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా కాన్పూర్ వికెట్ స్లోగా ఉండి స్పిన్నర్లకు సహకరిస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా ఆడటం ఖాయం కాగా.. మూడో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కనుంది. మరోవైపు బూమ్రా, సిరాజ్ లలో ఒకరికి రెస్ట్ ఇస్తారని భావిస్తున్నారు. తొలి టెస్ట్‌లో సిరాజ్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేసిన ఆకాశ్ దీప్ ను కొనసాగించే అవకాశాలున్నాయి. మరోవైపు సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉన్న బంగ్లాకు కాన్పూర్ పిచ్ సవాల్ గానే చెప్పొచ్చు. ఇక మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందని సమాచారం. తొలి మూడురోజుల పాటు కాన్పూర్ లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. కాగా ఈ సిరీస్ ను 2-0తో వైట్ వాష్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తుకు చేరువవ్వాలని భారత్ భావిస్తోంది.