IND vs PAK: ఆసియా కప్ 2023 టోర్నీలోనే హై ఓల్టేజ్‌గా నిలిచే ఇండియా-పాక్ మ్యాచ్ శనివారం జరగబోతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎన్నో అంచనాలను పెట్టుకుంది. ఈ మ్యాచ్ కోసం రోజువారీ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నవారు కూడా లేకపోలేదు. అయితే ఈ మ్యాచ్ చూడడానికి నేనూ వస్తానంటున్నాడు వరుణ దేవుడు. అవును, భారత్-పాక్ మ్యాచ్ జరిగే క్యాండీలో వర్షం పడేందుకు అవకాశం ఉంది.
ముఖ్యంగా మ్యాచ్ సమయంలో వర్షం అడ్డుపడేందుకు 70 నుంచి 73 శాతం అవకాశం ఉన్నట్లు వాతావారణ నివేదికలు చెబుతున్నాయి. క్రికెట్ అభిమానుల కోరిక మేరకు భారత్-పాక్ మ్యాచ్‌కి వరుణుడు అడ్డు రాకుంటే అంతా సజావుగా జరుగుతుంది. అలాగే మ్యాచ్‌లో భారత్ లేదా పాక్ విజేతగా నిలుస్తాయి. కొంత సమయం వర్షం పడి ఆగితే.. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ ఓవర్లను కుదించే అవకాశం ఉంది. అదే జరిగితే క్రికెట్ అభిమానులు కొంత నిరాశచెందినా మ్యాచ్ ఫలితం తేలేందుకు అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్ 2న క్యాండీలో వర్షం పడేందుకు దాదాపు 93 శాతం అవకాశం ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రద్దు అయితే..? అప్పుడు ఏంటి పరిస్థితి..? ఒక వేళ వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు 1-1 పాయింట్లు దక్కుతాయి. ఎందుకంటే ఇది హై ఓల్టేజ్ మ్యాచ్ అయినప్పటికీ దీనికి రిజర్వ్ డే లేదు. అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తే.. అది పాకిస్తాన్‌కి మేలు చేసినట్లే అవుతుంది.
ఎందుకంటే తొలి మ్యాచ్‌లో పసికూనపై ప్రతాపం చూపిన పాక్ ఇప్పటికే రెండు పాయింట్లతో ఆసియా కప్ పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. రేపటి మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయితే.. మరో పాయింట్ లభించడం వల్ల అప్పుడు కూడా 3 పాయింట్లతో పాకిస్తాన్ జట్టే అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇంకా.. నేరుగా సూపర్ ఫోర్ రౌండ్‌కి అర్హత సాధిస్తుంది. పాక్‌తో జరిగే మ్యాచ్ నుంచి భారత్‌కి ఒక పాయింట్ వచ్చినా.. నేపాల్‌తో జరిగే రెండో మ్యాచ్‌లో భారీ రన్ రేట్‌తో గెలిస్తేనే ‘గ్రూప్ ఏ’ టేబుల్‌లో రోహిత్ సేన అగ్రస్థానంలో ఉంటుంది. ఇంకా సూపర్ ఫోర్ రౌండ్‌కి అవకాశాలు ఉంటాయి. పల్లెకెలె స్టేడియంలో టీమిండియా లెక్కలను ఓ సారి గమనిస్తే.. భారత జట్టు ఈ మైదానంలో 3 వన్డేలు ఆడింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే.. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజేతగా నిలిచింది.