India Vs England : రేపే  భారత్‌, ఇంగ్లండ్‌ ఐదో టెస్ట్‌

భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ధర్మశాల చేరుకున్న ఇరు జట్లు...ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి

 

భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ధర్మశాల చేరుకున్న ఇరు జట్లు…ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌, ఇంగ్లండ్ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో…ఈ మ్యాచ్‌తో వందో టెస్టు పూర్తి చేసుకోనున్నారు. ధర్మశాలలో జరిగే ఐదో టెస్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భారత బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లాండ్ బ్యాటర్ బెయిర్‌స్టో…తమ కెరీర్‌లో వందో టెస్టు పూర్తి చేసుకోనున్నారు. ఈ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో స్పిన్నర్‌ అశ్విన్‌ కీలకపాత్ర పోషించాడు. 4 టెస్టుల్లో 17 వికెట్లు తీసిన అతడు.. బ్యాటింగ్‌లోనూ కొన్ని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న అశ్విన్‌.. 100వ టెస్టు ఆడబోతున్న 14వ భారత ఆటగాడిగా నిలవబోతున్నాడు. అంతేకాదు తొలి తమిళనాడు క్రికెటర్‌. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఒంటిచేత్తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లాండ్‌ స్టార్‌ జానీ బెయిర్‌స్టో మాత్రం ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో బ్యాట్‌ ఝులిపించలేదు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో బెయిర్‌స్టో అత్యధిక స్కోరు 38 మాత్రమే. ఫామ్‌ కోల్పోయినా..100వ టెస్టులోనైనా సత్తా చాటుతాడని ఆ జట్టు భావిస్తోంది. కెరీర్‌లో అరుదైన మైలురాయి అందుకుంటున్న బెయిర్‌స్టో కచ్చితంగా ధర్మశాల టెస్టును చిరస్మరణీయం చేసుకుంటాడని భావిస్తున్నారు. ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్‌ మరోసారి మ్యాజిక్‌ చేస్తాడా ? బెయిర్‌స్టో బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కివీస్‌ ప్లేయర్లు విలియమ్సన్, టిమ్‌ సౌథీ కూడా 100 టెస్టుల మైలురాయిని అందుకోబోతున్నారు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఈ ఘనత సాధించనున్నారు.