భారత్-ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్‌లో కీ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. 1-1తో ఈక్వల్‌గా ఉన్న రెండు టీమ్‌లు.. ఈ మ్యాచ్‌లో గెల్చి.. సిరీప్‌పై పట్టుసాధించాలని పట్టుదలతో ఉన్నాయి. మరోవైపు.. రాజ్‌కోట్ టెస్ట్ హిస్టారికల్ మ్యాచ్‌గా నిలిచిపోనుంది. కీలక ఆటగాళ్లకు బెస్ట్ మెమొరీస్‌ను మిగల్చనుంది.
విశాఖలో జరిగిన రెండో టెస్టు తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టుకు రెడీ అయ్యాయి. రాజ్‌కోట్ వేదికగా ఉదయం తొమ్మిదిన్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజ్‌కోట్ స్టేడియం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ చెబుతోంది. హైదరాబాద్ మ్యాచ్‌ను చేజేతులా వదులకున్న టీమిండియా… విశాఖలో గట్టెక్కింది. రాజ్‌కోట్‌లో కూడా గెలిచి ఇంగ్లండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాలని రోహిత్‌సేన భావిస్తోంది. ఇటు ఇంగ్లండ్ ఎలాగైనా మూడో టెస్టులో గెలిచి స్వదేశంలో భారత్‌ను ఓడించిన ఘనతను సాధించాలని పట్టుదలతో ఉంది.
రోహిత్ సేనను గాయాలు వేధిస్తున్నాయి. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో.. కీపర్ భరత్ ప్లేస్‌లో జురెల్ టీమ్‌లోకి రావడం గ్యారెంటీగా కనిపిస్తోంది. గిల్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాకపోవడంతో.. ఆడతాడా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఫామ్‌లో లేని శ్రేయస్ అయ్యర్‌పై వేటు పడింది. రెండో టెస్టుకు దూరంగా ఉన్న జడేజా మళ్లీ జట్టులో చేరాడు. సొంతమైదానం కావడంతో జడేజా ఆడటం గ్యారెంటీ. దీంతో కుల్‌దీప్, అక్షర్‌లో ఎవరిని పక్కన పెడతారన్న చర్చ సాగుతోంది.
మరోవైపు.. రాజ్‌కోట్ టెస్ట్ హిస్టరీ క్రియేట్ చేయనుంది. రెండు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్.. వ్యక్తిగతంగా పలువురు ఆటగాళ్లకు మధుర జ్ఞాపకాలను పంచనుంది. టెస్టుల్లో ఐదు వందల వికెట్ల క్లబ్‌లో చేరేందుకు టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్ ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీస్తే అశ్విన్ ఈ ఫీట్ సాధిస్తాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీయగా.. తర్వాతి స్థానంలో అశ్విన్ నిలుస్తాడు. 97 టెస్టులాడిన అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం 499 వికెట్లున్నాయి.
ఇక ఇంగ్లండ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్.. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయగలిగితే టెస్టుల్లో 700 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. అంతేకాకుండా.. అండర్సన్‌కు ఇది 185వ టెస్టు అవుతుంది. అండర్సన్.. ఇప్పటివరకు 184 టెస్టులలో 695 వికెట్లు తీశాడు. బజ్‌బాల్ వ్యూహంతో టెస్టులను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇది వందో టెస్టు. ఈ మైలు రాయిని అందుకున్న ఇంగ్లండ్ క్రికెటర్‌గా బెన్ స్టోక్స్ చరిత్రకెక్కనున్నాడు.
అశ్విన్, జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్.. ఈ ముగ్గురూ రాజ్‌కోట్ టెస్టును మెమొరెబుల్‌గా మలుచుకోవాలని భావిస్తున్నారు. రికార్డుల మోత మోగే అవకాశం ఉండటంతో.. రాజ్‌కోట్ టెస్ట్ హిస్టారికల్ మ్యాచ్‌గా మిగిలిపోనుంది.