వర్షం వస్తూ పోతూ ఉండటంతో.. ఆటగాళ్లు అసలు మైదానంలోకి కూడా రాలేకపోయారు. భారీ వర్షం కారంగా మ్యాచ్ సాధ్యపడకపోవడంతో.. చివరికి అంపైర్లు ఆటను రద్దు చేశారు. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కానీ, టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ సేన ఈ రికార్డు నెలకొల్పింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 12.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరుపై ఉంది. 2001లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక 13.2 ఓవర్లలో 100 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా శ్రీలంక 21 ఏళ్ల పాటు కొనసాగింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మరో 6 బంతులు ముందుగానే ఈ రికార్డు అందుకుంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఈ రికార్డు నెలకొల్పారు. రోహిత్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా.. జైస్వాల్ 30 బంతుల్లో 38 పరుగులు చేశాడు. జైస్వాల్, రోహిత్ కలిసి 98 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ ఔట్ అనంతరం జైస్వాల్, గిల్ కలిసి జట్టు స్కోరుని 100 దాటించారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది.