దాదాపు నెలన్నర రోజుల విరామం తర్వాత టీమిండియా మైదానంలోకి అడుగుపెడుతోంది. బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కోసం చెన్నైలో ప్రాక్టీస్ షురూ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా టీమ్ అంతా నెట్స్ లో చెమటొడుస్తున్నారు. కాగా చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ముందు భారత్ అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. 92 ఏళ్ళ భారత టెస్ట్ క్రికెట్ లో ఓటముల కంటే విజయాలు ఎక్కువ సాధించిన టీమ్స్ జాబితాలో చోటు దక్కించుకునే రికార్డు ఊరిస్తోంది. సుధీర్ఘ ఫార్మాట్ లో భారత్ ఇప్పటివరకు 579 మ్యాచ్‌లను ఆడింది. ఇందులో 178 మ్యాచ్‌ల్లో గెలిచి…సరిగ్గా 178 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక 222 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా.. ఒక మ్యాచ్ టైగా అయింది.
దీంతో తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై గెలిస్తే టెస్టు క్రికెట్‌లో ఓటములు కంటే విజయాలు ఎక్కువగా ఉన్న నాలుగో టీమ్‌గా రికార్డుల్లో నిలవనుంది. ఇప్పటి వరకు ఈ రికార్డ్‌ని భారత్ అందుకోలేదు. టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం నాలుగు జట్ల ఖాతాలో మాత్రమే ఓటముల కంటే విజయాల్ని ఎక్కువగా సాధించాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 866 టెస్టులు ఆడగా, ఇందులో 414 విజయాలు, 232 ఓటములు ఉన్నాయి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ , సౌతాఫ్రికా కూడా ఉండగా… ఇప్పుడు భారత్ చేరువలో నిలిచింది.