India vs Sri Lanka: ఆసియాకప్ 2023 టైటిల్ గెలిచిన టీమిండియా.. 23 ఏళ్ల పగను తీర్చుకుంది. శ్రీలంకతో ఆదివారం జరిగిన ఫైనల్లో సంచలన బౌలింగ్‌తో 10 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 8వ సారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్ల సంచలన బౌలింగ్‌తో 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాలు సైతం సత్తా చాటారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా ఆడుతూ.. పాడుతూ.. 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
ఈ గెలుపుతో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది. అత్యధిక పరుగులు.. బంతుల వ్యత్యాసంతో విజయం సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. మరోవైపు శ్రీలంక భారీ పరుగుల తేడాతోపాటు బంతుల వ్యత్యాసంతో ఓటమిపాలైన జట్టుగా నిలిచింది. అంతేకాకుండా వన్డే క్రికెట్‌లో అత్యంత తక్కువ బంతులకే ఆలౌటైన జట్టుగా.. స్వల్ప స్కోర్ నమోదు చేసిన టీమ్‌గా అప్రతిష్టను మూటగట్టుకుంది. 23 ఏళ్ళ క్రితం 2000 సంవత్సరంలో జరిగిన కోకోకోలా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో శ్రీలంక చేతిలో టీమిండియా 54 పరుగులకే ఓటమిపాలై ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసింది. సనత్ జయసూర్య 189 పరుగుల భారీ సెంచురీతో చెలరేగాడు.
అనంతరం భారత్‌పై.. చమిందావాస్ పద్నాలుగు పరుగులిచ్చి కీలకమైన 5 వికెట్లు పడగొట్టాడు. వాస్ ధాటికి 26.3 ఓవర్లలో 54 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. భారత బ్యాటర్లలో సచిన్, గంగూలీ, యువరాజ్ సింగ్, వినోద్ కాంబ్లీ దారుణంగా విఫలమయ్యారు. తిరిగి ఇన్నాళ్లకు టీమిండియా తాజా ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను 50 పరుగులకే కుప్పకూల్చి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయం నేపథ్యంలో భారత అభిమానులు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు.