IND Vs AFG: ఊపేసిన డబుల్ సూపర్ ఓవర్.. టీ ట్వంటీ సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్

బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

  • Written By:
  • Updated On - January 18, 2024 / 01:44 PM IST

IND Vs AFG: కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సీరీస్‌ను విజయంతో తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో ఆఫ్గనిస్తాన్‌పై రెండో సూపర్ ఓవర్‌ (SUPER OVER)లో ఇండియా గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల సీరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Mega Star Chiranjeevi: చిరంజీవికి పద్మ విభూషణ్.. మెగా సంబరం..?

ఈ దశలో రోహిత్ (ROHIT SHARMA)-రింకూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 64 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్.. 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులు చేయగా.. రింకూ సింగ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఛేజింగ్‌కు అనుకూలించే బెంగుళూరు పిచ్‌పై ఆఫ్గనిస్తాన్ కూడా ధాటిగా ఆడింది. వికెట్లు పడుతున్నా ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లతో దుమ్మురేపారు.

టాపార్డర్‌లో ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయగా.. మధ్యలో పుంజుకున్న భారత్ బౌలర్లు వరుస వికెట్లు తీసి కట్టడి చేశారు. అయితే గుల్బాడిన్ మెరుపు హాఫ్ సెంచరీ.. భారత్ విజయాన్ని అడ్డుకుంది. చివరి ఓవర్‌లో విజయం కోసం 19 రన్స్ చేయాల్సి ఉండగా ముకేష్ కుమార్ ఒత్తిడికి లోనయ్యాడు. ఫలితంగా ఆఫ్గనిస్తాన్ 18 రన్స్‌తో మ్యాచ్‌ని టై చేసింది. ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గనిస్తాన్ 16 పరుగులు చేసింది. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లతో విరుచుకుపడినా చివరి బంతికి ఒక పరుగే రావడంతో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. తర్వాత రెండో సూపర్ ఓవర్‌లో భారత్ గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సీరీస్‌ను 3-0 తో స్వీప్ చేసింది.