India Tour: జూలై 12 నుంచి ఆగస్టు 13 వరకు ఇండియా- వెస్ట్ ఇండీస్ టూర్ షెడ్యూల్ ఖరారు

పదేళ్ల తర్వాత తొలిసారి డొమినికాలో భారత జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడుతుండటం గమనార్హం. ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్‌లో రెండో టెస్టు జులై 20న ఆరంభమవుతుంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన వెంటనే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీసులు మొదలవుతాయి.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 11:16 AM IST

India Tour: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో సైకిల్‌లో టీమ్‌ఇండియా తొలుత వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. కరీబియన్‌ టీమ్‌తో రెండు టెస్టుల సిరీసు ఆడనుంది. జులై 12 నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌ మొదలవుతుంది. పదేళ్ల తర్వాత తొలిసారి డొమినికాలో భారత జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడుతుండటం గమనార్హం.

ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌పార్క్ ఓవల్‌లో రెండో టెస్టు జులై 20న ఆరంభమవుతుంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన వెంటనే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీసులు మొదలవుతాయి. మొత్తంగా ఆగస్టు 13న ఈ పర్యటన ముగుస్తుంది. ఆఖరి రెండు టీ20లకు అమెరికాలోని ఫ్లొరిడా ఆతిథ్యం ఇవ్వనుంది. లాడర్‌హిల్‌ స్టేడియంలో మ్యాచులు జరుగుతాయి. బార్బడోస్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌లో రెండు వన్డేలు, ఆ తర్వాత మూడో వన్డే, మొదటి టీ20 ట్రినిడాడ్‌లో జరుగుతాయి. రెండు, మూడో టీ20 గయానాలో నిర్వహిస్తారు. ‘తెల్ల బంతి క్రికెట్లో టీమ్‌ఇండియాకు ఆతిథ్యం ఇచ్చేందుకు మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కరీబియన్‌ దీవులు, అమెరికాలో మ్యాచులను వీక్షించేందుకు అభిమానులను ఆహ్వానిస్తున్నాం.

మొత్తం 18 రోజుల పాటు క్రికెట్‌ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయనుంది. క్రికెట్‌ లవర్స్‌ దీనిని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’ అని క్రికెట్‌ వెస్టిండీస్‌ సీఈవో జానీ గ్రేవ్‌ మీడియాకు తెలిపారు. టీమ్‌ ఇండియా 2011లో తొలిసారి డొమినికాలో టెస్టు క్రికెట్‌ ఆడింది. విండ్‌సార్ పార్క్‌ ఇందుకు ఆతిథ్యం ఇచ్చింది. సొంత దేశంలో వెస్టిండీస్‌ టెస్టు రికార్డు ఈ మధ్య కాలంలో మెరుగవుతోంది. చివరి రెండు సిరీసుల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌ను ఓడించింది. కాగా కరీబియన్‌ గడ్డపై టీమ్‌ ఇండియాకూ అద్భుతమైన రికార్డు ఉంది. ఆ దేశంలో ఆడిన చివరి నాలుగు టెస్టు సిరీసులను కైవసం చేసుకుంది.