వెస్టిండీస్ చేతిలో వరుసగా రెండు టి20ల్లో ఓడిన టీమిండియాను అభిమానులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటర్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ముందు వరకు కూడా శుబ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుస పెట్టి సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్ లోనూ రెచ్చిపోయాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. అయితే ఇదంతా నాణెంకు ఒకవైపు మాత్రమే. ఐపీఎల్ తర్వాత నుంచి అతడి ఆట గాడి తప్పింది. పరుగుల కోసం తెగ ఇబ్బంది పడుతున్నాడు.
వెస్టిండీస్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. శుబ్ మన్ గిల్ పేలవ ఫామ్ ను మూడు దశలుగా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది.. లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఆడటంలో ఇబ్బంది పడుతుండటం. ఐపీఎల్ ఫైనల్లో రవీంద్ర జడేజా బౌలింగ్ లో స్టంపౌట్ అయినప్పటి నుంచి లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కొనడంలో గిల్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ తర్వాత ఐదు పరిమిత ఓవర్ల మ్యాచ్ లు ఆడిన గిల్.. కేవలం 31 పరుగులు మాత్రమే చేసి మూడు సార్లు అవుటయ్యాడు. రెండోది.. శుబ్ మన్ గిల్ పరుగుల ప్రవాహం కేవలం భారత్ లో మాత్రమే జరుగుతోంది.
విదేశాల్లో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక మూడోది.. టి20ల్లో శుబ్ మన్ గిల్ ఫామ్. ఇప్పటి వరకు 8 టి20లు ఆడిన గిల్ 212 పరుగులు చేశాడు. అయితే ఇందులో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టి20 పోరులో 126 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ ను తీసేస్తే మిగిలిన 7 మ్యాచ్ ల్లో గిల్ చేసిన పరుగులు కేవలం 86 పరుగులు మాత్రమే. గిల్ చేసిన పరుగుల్లో చాలా వరకు అహ్మదాబాద్ లో చేసినవే. ఈ గణాంకాలను గుర్తుచేస్తూ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. యశస్వి జైస్వాల్, ఋతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లవైపు సెలెక్టర్లు దృష్టిపెట్టకముందే, గిల్ తన బ్యాటింగ్ విధ్వంసాలను షురూ చేయాలనీ అభిమానులు కోరుతున్నారు.