IND Vs NEP: లగాన్ ఇండియా.. సర్కస్ ఫీల్డింగ్‌తో చుక్కలు..!

చేతుల్లోకి వచ్చిన సునాయస క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అది కూడా వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లు అయిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ క్యాచ్‌లు అందుకోలేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 04:46 PM IST

IND Vs NEP: ఆసియాకప్ 2023లో భాగంగా పసికూన నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా చెత్త ఫీల్డింగ్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన సునాయస క్యాచ్‌లను అందుకోలేకపోయింది. వర్ష ప్రభావమో లేక సరైన ప్రాక్టీస్ లేకపోవడమో కానీ చేతుల్లోకి వచ్చిన సునాయస క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు.

అది కూడా వరల్డ్ బెస్ట్ ఫీల్డర్లు అయిన విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ క్యాచ్‌లు అందుకోలేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కుషాల్ భ్రుటెల్ స్లిప్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు. సిరాజ్ వేసిన ఆ మరుసటి బంతికే మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను షార్ట్ కవ‌ర్‌లో ఉన్న కోహ్లీ నేలపాలు చేశాడు. ఆ తర్వాత మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కుషాల్ బ్రుటేల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అందుకోలేకపోయాడు.

గ్లోవ్స్ సాయంతో కూడా అతను బంతి అందుకోలేకపోయాడు. వరుసగా మూడు క్యాచ్‌లను నేలపాలు చేయడాన్ని చూసి భారత అభిమానులు తలలు పట్టుకున్నారు. ఈ అవకాశాలతో చెలరేగిన నేపాల్ ఓపెనర్లు భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వరుస బౌండరీలతో పరుగులు రాబట్టారు. భారత చెత్త ఫీల్డింగ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. పసికూన నేపాల్‌పై ఇంత చెత్త ఫీల్డింగ్ ఏంటని నిలదీస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ లగాన్ సినిమాను తలపిస్తుందని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.