ఒకటిన్నర సెషన్ లోనే ఖతమ్ బంగ్లాను వణికించిన భారత పేసర్లు

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. ఇటీవలే పాక్ గడ్డపై సంచలన ప్రదర్శనతో సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ పై చాలా అంచనాలు పెరిగాయి.

  • Written By:
  • Updated On - September 20, 2024 / 06:30 PM IST

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. ఇటీవలే పాక్ గడ్డపై సంచలన ప్రదర్శనతో సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ పై చాలా అంచనాలు పెరిగాయి. భారత్ కు గట్టిపోటీనిస్తుందని, తేలిగ్గా తీసుకోవద్దంటూ పలువురు సూచనలు కూడా చేశారు. దానికి తగ్గట్టే తొలిరోజు తొలి సెషన్ లో ఆధిపత్యం కనబరిచిన బంగ్లాకు తర్వాత టీమిండియా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అశ్విన్, జడేజా పార్టనర్ షిప్ తో భారీస్కోర్ అందుకుంది. ఇక రెండోరోజు బౌలర్లు కూడా సత్తా చాటారు. ముఖ్యంగా భారత పేసర్లు బూమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ బంగ్లా బ్యాటర్లను వణికించారు. చెపాక్ రెడ్ సాయిల్ పిచ్ పై తమదైన పేస్ తో బంగ్లాకు చుక్కలు చూపించారు. బూమ్రా, ఆకాశ్ దీప్ బంతులకు బంగ్లా బ్యాటర్లకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది.

చాలా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న బూమ్రా తన రిథమ్ ను కొనసాగిస్తూ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక మూడో పేసర్ గా చోటు దక్కించుకున్న ఆకాశ్ దీప్ కూడా అదరగొట్టేశాడు. వ‌రుస బంతుల్లో అత‌ను రెండు వికెట్లు తీసుకున్నాడు. జ‌కీర్‌, హ‌క్‌ల‌ను అత‌ను ఒకే త‌ర‌హా బంతుల‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ బాల్స్ కు బంగ్లా బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ముగ్గురు పేసర్లు కలిసి 8 వికెట్లు పడగొట్టగా జడేజా 2 వికెట్లు తీశాడు. ఫలితంగా బంగ్లా ఇన్నింగ్స్ ఒకటిన్నర సెషన్ లోనే ముగిసిపోయింది.