ఫ్లైట్ వద్దు…రైలులోనే వస్తా దటీజ్ ధోనీ

  • Written By:
  • Publish Date - September 4, 2024 / 10:19 PM IST

మన దేశంలో ఒక్కసారి టీమిండియాకు ఎంపికైన ఆటగాడి లైఫే మారిపోతుంది. ఫ్లైట్ టికెట్స్, లగ్జరీ హోటల్ లో బస.. ఇలా అంతా సెలబ్రిటీ జీవితాన్నే ఆస్వాదిస్తుంటారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. వారిలో మాజీ కెప్టెన్ ధోనీ పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తాను స్టార్ ప్లేయర్ అయినప్పటకీ దేశవాళీ క్రికెట్ ఆడినప్పుడు సహచర ఆటగాళ్ళతో కలిసిమెలిసి ఉండేవాడు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసినా వద్దన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. భారత్ కు ఆడుతున్నా కూడా ఖాళీ దొరికితే జార్ఖండ్ రంజీ టీమ్ కు ధోనీ ప్రాతినిథ్యం వహిస్తుండేవాడు. అప్పుడు జరిగిన ఓ సంఘటన జార్ఖండ్ ప్లేయర్ ఒకరు అందరితో పంచుకున్నారు.

2017లో విజయ్ హాజారే ట్రోఫీలో ధోనీ బరిలోకి దిగాడు. కోల్‌కతాలో జరిగిన ఓ మ్యాచ్‌ కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ధోనీ ఒక్కడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది. మిగతా ఆటగాళ్లందర్నీ రైలులో పంపించేందుకు సిద్దమైంది. ధోనీ స్టార్ ప్లేయర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఆటగాళ్ళు రాలేదా అని ధోనీ అడిగినప్పుడు అసలు విషయం చెప్పారు. దీంతో తాను ప్రత్యేకం కాదని, వారితోనే వెళతానంటూ సిద్ధమయ్యాడు. జార్ఖండ్ అసోసియేషన్ అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి మిగిలిన ఆటగాళ్ళతో ట్రైన్ లోనే ప్రయాణించాడు. తాను టికెట్ కలెక్టర్ గా పనిచేసిన అనుభవాలను ఈ జర్నీలో తమతో పంచుకున్నాడని జార్ఖండ్ క్రికెటర్లు చెప్పారు. ధోనీ సింప్లిసిటీకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.