IPL 2024: క్రికెట్ పండగ.. ఐపీఎల్ సీజన్ 17 షురూ.. ఈసారి నాలుగు కొత్త రూల్స్

మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ జరగుతోంది. ఈ సీజన్‌లో 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇదే టైమ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ప్రస్తుతానికి 15 రోజుల IPL షెడ్యూల్‌నే ప్రకటించారు.

  • Written By:
  • Updated On - March 22, 2024 / 04:18 PM IST

IPL 2024: కాసేపట్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభమవుతోంది. చెన్నై చిదంబరం స్టేడియంలో అట్టహాసంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ జరగుతోంది. ఈ సీజన్‌లో 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇదే టైమ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ప్రస్తుతానికి 15 రోజుల IPL షెడ్యూల్‌నే ప్రకటించారు. ఈసారి రెండు టీమ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మ, ఎం.ఎస్ ధోనీ తప్పుకున్నారు. ముంబై జట్టుకు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్య, చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తారు.

CSK VS RCB: చెపాక్‌లో ఫేవరెట్‌గా చెన్నై.. బెంగళూరుకు సవాలే

ప్రమాదం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించిన రిషబ్ పంత్ ఈ సీజన్‌లో రంగంలోకి దిగుతున్నాడు. ఢిల్లీ కెప్టెన్‌గా పంత్ ఉంటారు. గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్య.. ముంబై టీమ్‌లోకి వెళ్లడంతో గుజరాత్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. IPLలో ఇప్పటిదాకా ధోనీ సారథ్యంలో 10సార్లు ఫైనల్‌కి చేరిన చెన్నై టీమ్. 5 సార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచింది. అంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత కచ్చితత్వం, వేగం పెంచేందుకు ఈ సీజన్ నుంచి స్మార్ట్ రీప్లే సిస్టమ్ అమలు చేస్తున్నారు. అంటే ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉండే గదిలోనే ఉంటారు. ఫీల్డ్ అంతటా ఉన్న 8 హాక్ ఐ స్పీడ్ కెమేరాల నుంచి వచ్చే ఫుటేజ్‌ను వీళ్ళు వెంటనే అంపైర్లకు అందిస్తారు. ఈ సీజన్‌లో నాలుగు కొత్త నిబంధనలు పెట్టారు. అందులో ఒకటి స్మార్ట్ రీప్లే. రెండోది రెండు బౌన్సర్లు. మూడోది నో స్టాప్ క్లాక్. నాలుగో రూల్.. స్టంపింగ్ క్యాచ్ చెక్. ఈ సీజన్‌లో బౌలర్ ఒక ఓవర్‌‌లో రెండు బౌన్సర్ల వరకూ వేసేందుకు అనుమతి ఉంటుంది.

ఇప్పటి వరకూ ఒక ఓవర్‌లో ఒకే బౌన్సర్‌కి మాత్రమే ఛాన్సుండేది. ఓవర్‌కు రెండు బౌన్సర్ల నిబంధనను ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ రూల్ IPLలో కూడా ఉంటుంది. నో స్టాప్ క్లాక్.. అంటే ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకన్లకు మించి గ్యాప్ ఉండకూడదు. అందుకోసం స్టాప్ క్లాక్ ఉపయోగిస్తారు. ఒక ఇన్నింగ్స్‌లో మూడు సార్లు స్టాప్ క్లాక్ రూల్ బ్రేక్ చేస్తే.. బౌలింగ్ టీమ్‌కు 5 పరుగులు పెనాల్టీ విధించి, బ్యాటింగ్ టీమ్‌కు జత చేస్తారు. స్టంపింగ్ క్యాచ్ చెక్.. అంటే స్టంపింగ్ కోసం రిఫరల్ అభ్యర్దిస్తే క్యాచ్ చెక్ చేస్తారు. నిజానికి ఈ రూల్ ఐసీసీలో లేదు. కానీ, IPLలో BCCI అమలు చేస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఎండా కాలంలో జరుగుతున్న ఈ IPL సిరీస్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులకు వేసవి వినోదాన్ని పంచబోతున్నాయి. రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో బెర్త్ దక్కించుకోడానికి యువ ఆటగాళ్ళతో పాటు సీనియర్లకు కూడా ఈ IPL కీలకంగా మారబోతోంది.