ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 సీజన్లు పూర్తి చేసుకుంది. వచ్చే సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగనుండగా.. రిటెన్షన్ రూల్స్ పై త్వరలో క్లారిటీ రానుంది. అయితే ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాపై దాదాపు క్లారిటీకి వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ నలుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకోనుంది. గత సీజన్ లో శిఖర్ ధావన్ గాయం నుంచి తప్పుకోవడంతో జట్టు పగ్గాలు అందుకున్న ఆల్ రౌండర్ సామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ తమతో పాటే కొనసాగించుకోనుంది. 2024 సీజన్ లో సామ్ కరన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. 270 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు తీశాడు. కెప్టెన్ గా కూడా టాలెంట్ ఉండడంతో అతన్ని రిటైన్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అలాగే బౌలర్ అర్షదీప్ సింగ్ ను కూడా పంజాబ్ రిటైన్ చేసుకోవడం ఖాయం. గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు బౌలింగ్ కు అత్యంత కీలకంగా ఉన్న అర్షదీప్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునే అవకాశం లేదు. అర్షదీప్ సింగ్ గత సీజన్ లో 19 వికెట్లతో పంజాబ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక యువ బ్యాటర్ శశాంక్ సింగ్ ను కూడా పంజాబ్ వేలంలోకి వదిలే అవకాశాలు లేవు. ఎందుకంటే శశాంక్ సింగ్ 2024 ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపాడు. సంచలన బ్యాటింగ్ తో పంజాబ్ కు విజయాలను అందించాడు. 14 మ్యాచ్ లలో 354 పరుగులు చేశాడు. కాగా మరో యంగ్ ఆల్ రౌండర్ అశుతోష్ సింగ్ ను కూడా పంజాబ్ రిటైన్ చేసుకునే అవకాశముంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలనుకుంటున్న పంజాబ్ వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది.