No tax: మనకేమో పన్ను బాదుడు.. ఐపీఎల్‌కి ట్యాక్స్‌ ఫ్రీ అంట! ఎందుకో తెలుసా?

వచ్చే జీతమేమో కానీ సగం డబ్బులు పన్నులకే పోతాయి.. అసలు మనకు తెలియకుండానే మన వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుంది ప్రభుత్వం..అయితే లక్షల కోట్ల ఆదాయం వస్తున్న క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌కు మాత్రం పన్నులుండవ్‌ అని మీకు తెలుసా?

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 06:35 PM IST

ట్యాక్స్‌ కట్టడం పౌరుల బాధ్యత..! ఉప్పు, పప్పు దగ్గర నుంచి మెడిసిన్స్‌ ఖర్చుల వరకు దాదాపు అన్నీ వస్తువులపైనా ట్యాక్స్‌ కడుతుంటాం.. అటు ప్రభుత్వం కూడా దొరికందే సందు కదా అని టైమ్‌ చూసి పన్నులు పెంచుకుంటూ పోతుంటుంది. ఎందుకని అడిగితే సరైన సమాధానముండదు. ఓ వ్యక్తి రోజుకు 10-12గంటలు కష్టపడి.. మరో రెండు గంటలు ట్రాఫిక్‌లో కాలం గడిపి.. ఏ రాత్రో ఇంటికి చేరుకొని.. అరకొరగా తిని..నిద్రపోయి..మళ్లీ ఉదయానే లేచి..పరుగుపరుగున ఉద్యోగానికి వెళ్తుంటాడు! అటు పొట్ట కూటి కోసం.. ఒక్క పూట తిండి కోసం..ఏదో ఒక పని చేసుకుంటూ బతికే ప్రజలు మన దేశంలో కోట్లలో ఉన్నారు..వీరంతా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా పన్ను చెల్లిస్తుంటారు. నిజానికి పన్ను కట్టని మనిషే ఉండడు! పన్నులు కట్టాలి కూడా.. అయితే ఏడాదికి వేలు, లక్షలు సంపాదించే సామాన్యులు తమ జీతం నుంచి సగం డబ్బులు వరకు ట్యాక్స్‌ కడుతుండగా.. మరోవైపు వేల కోట్లు సంపాదిస్తున్న ఐపీఎల్‌ మాత్రం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పన్ను కట్టదని మీకు తెలుసా?

ఐపీఎల్‌ అంటేనే ఇండియన్‌ క్రికెట్ బోర్డు బీసీసీఐ(BCCI)కి కాసుల పంట! దానికి తగ్గట్టే మ్యాచ్‌లు కూడా చివరి బంతి వరకు సాగుతుంటాయి. అందుకే ఐపీఎల్‌ చూడటానికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అభిమానుల పిచ్చిని క్యాష్‌ చేసుకోవడంలో బీసీసీఐని మించిన బోర్డు ప్రపంచంలో మరొకటి లేదు. 2023-2027 మధ్య కాలానికి నిర్వహిస్తోన్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో టీవీ, డిజిటల్ రైట్స్ కలిపి రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. అటు కేవలం డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయకామ్ రూ. 20 వేల కోట్లకుపైగా వెచ్చించి దక్కించుకుంది. ఈ లెక్కలు చాలు బీసీసీఐకు వచ్చే ఆదాయం ఎలాంటిదో తెలియడానికి..ఇందులో ఫ్రాంచైజీలకు వాటా ఉంటుంది. మిగతావి మెయింటైన్స్‌, శాలరీలు లాంటివి ఉంటాయి.. ఎంత కాదనుకున్నా బీసీసీఐకి మిగిలేది వేల కోట్లలోనే ఉంటుంది..మరి ఆ డబ్బంతా బీసీసీఐ ఏం చేస్తుంది..? కనీసం ట్యాక్స్‌ అయినా కడుతుందా?

ట్యాక్స్‌ కడుతుంతా అని మనం ప్రశ్నించాల్సిన అవసరంలేదు..ఎందుకంటే మన చట్టాలు అలా ఉంటాయి మరి! ఐపీఎల్‌ ఫ్రీ ట్యాక్స్‌ టోర్నమెంట్‌. ఎందుకంటే బీసీసీఐ ప్రకారం క్రికెట్ ప్రమోషన్‌ కోసం పెట్టిన టోర్నమెంట్‌ ఐపీఎల్‌. సెక్షన్ 12ఏ ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం బీసీసీఐ ఐపీఎల్‌కు సంబంధించి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. అయితే దీనిపై పలువురు కోర్టులు ఆశ్రయించగా.. అక్కడ కూడా బీసీసీఐకి అనుకూలంగానే తీర్పులొచ్చాయి. 2021-2016లో రెవెన్యూ శాఖ జారీ చేసిన మూడు షోకాజ్ నోటీసులకు సంబంధించి బీసీసీఐ 2017లో ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT)ని ఆశ్రయించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 12ఏ కింద బీసీసీఐకి లభించే పన్ను మినహాయింపును ఎందుకు రద్దు చేయకూడదో బీసీసీఐ వివరించింది. బోర్డు వాదనలను సమర్థించిన ధర్మాసనం ఐపీఎల్ ద్వారా బీసీసీఐ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ, క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యం ఉందన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో ఐపీఎల్ ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది.

నిజానికి చట్టలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అయితే ప్రజలను ముప్పుతిప్పలు పెట్టడానికి చట్టాలను మారుస్తుంటారు కానీ.. ఇలా ప్రపంచంలోని క్రికెట్‌ బోర్డులతో పాటు ఐసీసీలోనూ చక్రం తిప్పుతున్న బీసీసీఐ నుంచి ట్యాక్స్‌ డబ్బులు తీసుకోవడానికి మాత్రం మనసు అంగీకరించదు. మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వచ్చే ఆదాయం దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లతో సమానం. ఎల్‌ఐసీ, పేటీఎం లాంటి కంపెనీల ఐపీఓ(IPO)ల కంటే కూడా ఐపీఎల్ డిజిటల్‌ హక్కుల ద్వారా బీసీసీఐకి వచ్చే ఆదాయం ఎక్కువ! అయినా కూడా ఐపీఎల్‌ జేబులో నుంచి బీసీసీఐ ఒక్కటంటే ఒక్క రూపాయ్‌ కూడా పన్ను చెల్లించదు..! ఇది మన ప్రభుత్వాలు గొప్పలు పోయే మన ట్యాక్స్‌ సిస్టమ్‌ నిజస్వరూపం..!