ఐపీఎల్ (IPL) డిజిటల్ మ్యాచ్‌లు లాస్ట్ సీజన్ వరకు హాట్‌స్టార్‌లో (Hotstar) అందుబాటులో ఉండేవి. కానీ ఈసారి వయాకామ్ న్యూస్18 (Viacom News 18) ఆ హక్కులు సొంతం చేసుకుంది. జియో సినిమాలో (Jio cinema) ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని పబ్లిసిటీ చేసింది. అయితే అది జియో యూజర్లకు మాత్రమే పరిమితం. దీంతో ఏ స్థాయిలో వ్యూస్ ఉంటాయోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తొలిరోజు కాస్త తక్కువగా ఉండి తర్వాత పుంజుకుంటాయని కొంతమంది విశ్లేషించారు. అయితే జియో మాత్రం గట్టి నమ్మకంతో ఉంది. ఆ నమ్మకమే నిజమైంది. తొలిరోజే దాదాపు 5కోట్ల మంది జియో సినిమాలో మ్యాచ్‌ను చూశారు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ ధోనీ (MS Dhoni) సిక్స్‌లు కొట్టిన సమయంలో ఒకేసారి కోటిన్నర మందికి పైగా మ్యాచ్‌ను చూసారు. ఇక మ్యాచ్ ఫైనల్ ఓవర్స్‌కు చేరుకున్న సమయంలో కొన్ని నిమిషాల పాటు సగటున కోటిమందికి పైగా జియో సినిమాలో మ్యాచ్‌ను వీక్షించారు. తొలిరోజు ఎంకరేజింగ్ ఫిగర్స్‌తో జియో ఫుల్ హ్యాపీగా ఉంది. యూట్యూబ్ (Youtube) ఇండియా నెలసరి వ్యూయర్ షిప్ 51.40 కోట్లు. జియో సినిమాలో ఫస్ట్ డే మ్యాచ్ వ్యూస్ 5కోట్లు… ఈ ఫిగర్స్ చాలనుకుంటా జియో సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో చెప్పడానికి. పైగా 4కేలో అందుబాటులో ఉండటంతో వ్యూయర్స్‌కు మంచి అనుభూతిని ఇచ్చింది.
స్టార్ (Star), హాట్‌స్టార్‌కు (Hot Star) కూడా ఈ ఫిగర్స్ అంత ఆనందాన్నిచ్చేవి కాదు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా శాటిలైట్ యాడ్స్ రెవెన్యూ కంటే డిజిటల్ యాడ్స్ రెవెన్యూ ఎక్కువగా ఉండబోతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఐపీఎల్ ప్రకటనల ఆదాయంలో దాదాపు 60శాతం ప్రకటనల ఆదాయాన్ని వయాకామ్18 చేజిక్కించుకోబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వయాకామ్18 డిజిటల్ రైట్స్‌కు భారీగా బిడ్ చేసింది. ఐదేళ్ల కాలానికి రూ.23,758 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకంది. ఇక స్టార్‌స్పోర్ట్స్ (Star Sports) ఐపీఎల్ శాటిలైట్ రైట్స్ కోసం రూ.23,575కోట్లు చెల్లించనుంది. డిజిటల్ వ్యూస్ ఎక్కువగా ఉన్నప్పటికీ టైమ్‌స్పెంట్ మాత్రం టీవీపైనే ఎక్కువగా ఉంటుంది. ఇక డిస్నీ హాట్‌స్టార్ (Disney Hotstar) ఈ ఏడాది శాటిలైట్ రైట్స్ ద్వారా దాదాపు 3వేల కోట్ల రూపాయలు అర్జించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. స్పాన్సర్‌షిప్స్ దీనికి అదనం. ఇక జియో (వయాకామ్18) ఈ ఐపీఎల్ సీజన్‌లోనే రూ.3,700 కోట్ల బిజినెస్‌పై కన్నేసింది. ఇప్పటికే రూ.2,700కోట్ల డీల్స్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని తెలిపింది. డిస్నీ హాట్‌స్టార్‌కు 13మంది, వయాకామ్‌కు 21మంది స్పాన్సర్లు ఉన్నారు. మ్యాచ్‌లు మరింత ముందుకెళ్లి హాలిడే సీజన్ మొదలయ్యే సరికి బిజినెస్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి ఈ సంస్థలు.
తొలిరోజు జియో సినిమా వ్యూస్ బాగానే ఉన్నా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. యాప్ క్రాష్ అయ్యిందని, బఫరింగ్ సమస్య ఎదుర్కొంటున్నామంటూ సోషల్ మీడియాలో పలువురు ఫిర్యాదులు చేశారు. ఇది కాస్త ఇబ్బందిని కలిగించేదే. దీనిపై జియో సినిమా వెంటనే స్పందించింది. సమస్యను పరిశీలిస్తున్నామని మరోసారి ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని తెలిపింది. కొంతమంది కస్టమర్లకు యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోమని సూచించింది. మొత్తంగా చూస్తే జియోకు మాత్రం ఫస్ట్ డే మంచి ఎంకరేజ్‌మెంట్ అందించింది.