ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలన్నీ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నాయి. దాదాపు కీలక ఆటగాళ్ళంతా వేలంలోకి రానుండడంతో కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పట్టుదలగా ఉన్నాయి. మూడేళ్ళ కాంట్రాక్ట్ కింద ప్లేయర్స్ ను తీసుకోనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ళపై ఫోకస్ పెట్టాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ముగ్గురు యంగ్ స్టర్స్ పై కన్నేసింది. ప్రస్తుతం తన జట్టులోనే ఉన్న యువ ఆటగాడు రఘువన్షిని తిరిగి వేలంలో దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. 19 ఏళ్ళ ఈ యువ బ్యాటర్ గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అగ్రెసివ్ గా ఆడుతున్న రఘువన్షీకి మరింత తర్ఫీదునిస్తే మ్యాచ్ ను మలుపుతిప్పే ప్లేయర్ గా మారిపోవడం ఖాయమని కేకేఆర్ భావిస్తోంది.
అలాగే స్పిన్నర్ సుయాశ్ శర్మను కూడా మళ్ళీ వేలంలో కొనుగోలు చేయడం ఖాయం. ఈ లెగ్ బ్రేక్ గూగ్లూ స్పెషలిస్ట్ కోల్ కతా జట్టుతోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2023 సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్ లో ఎక్కువ అవకాశాలు రాకున్నా సుయాశ్ ఖచ్చితంగా మ్యాచ్ విన్నర్ అని కోల్ కతా భావిస్తోంది. అందుకే ఈ 21 ఏళ్ళ స్పిన్నర్ ను మరోసారి జట్టులోకి తీసుకోనుంది. ఇక మ్యాచ్ ఫినిషర్ రింకూసింగ్ ను కూడా ఖచ్చితంగా మళ్ళీ దక్కించుకోవాలని డిసైడయింది. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి అనూహ్యంగా మ్యాచ్ ను గెలిపించిన రింకూ అప్పటి నుంచి కోల్ కతా జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. చివరి ఓవర్లలో మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టే రింకూకు గత సీజన్ లో పెద్దగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశాలు రాలేదు. మ్యాచ్ ను ఫినిష్ చేసే సత్తా ఉన్న రింకూను ఈ సారి పెద్ద మొత్తమే వెచ్చించి కొనుగోలు చేసే అవకాశముంది.