ఐపీఎల్ (IPL) ఎడిషన్లు మారుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు రాత మాత్రం మారడం లేదు. 2016లో తొలిసారి టైటిల్‌ను ముద్దాడిన రైజర్స్.. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గత కొన్ని సీజన్లుగా మరీ పేలవంగా ఆడుతూ పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమవుతోంది.
జట్టును చాంపియన్‌గా నిలిపిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ (Australia Star Cricketer) డేవిడ్ వార్నర్ (David Warner) ను తప్పించిన తర్వాత.. న్యూజిలాండ్ (New Zealand) సారథి కేన్ విలియమ్సన్ (Kane Williams) కు పగ్గాలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కేన్ మామకూ ఉద్వాసన పలికి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో రైజర్స్ ఐపీఎల్ 2023 సీజన్లో కేవలం 4 మ్యాచ్ లే గెలిచింది.
ఈ నేపథ్యంలో.. ఐపీఎల్-2024 (IPL-2024) ఆరంభానికి ముందే కెప్టెన్ వేటలో పడ్డ సన్‌రైజర్స్ యాజమాన్యం మినీ వేలంలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్‌కప్ లో ఆసీస్‌ను విజేతగా నిలిపిన ఈ పేస్ బౌలర్ కోసం ఏకంగా 20.50 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తమ కెప్టెన్‌గా కమిన్స్‌ను నియమించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కమ్మిన్స్ కోసం కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టినప్పటకీ సన్‌రైజర్స్‌కు కెప్టెన్ అవసరముందన్నారు. ఈసారి ప్యాట్ కమిన్స్ రూపంలో వారికి మంచి ఆటగాడు దొరికాడునీ, కచ్చితంగా అతడినే కెప్టెన్‌గా నియమిస్తారని చెప్పుకొచ్చారు. అయితే సన్ రైజర్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్ పై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.