భారత క్రికెట్ లో సిక్సర్ల రారాజు యువరాజ్ సింగ్ బయోపిక్ ప్రకటించగానే ఎవరు హీరోగా నటిస్తారన్న చర్చ కంటే కథ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మొదలైంది. నిజానికి యువీ కెరీర్ గురించి అభిమానులకు తెలిసిందే… దేశవాళీ క్రికెట్, అండర్ 19 ప్రపంచకప్ తర్వాత జాతీయ జట్టులోకి ఎంట్రీ, ఆల్ రౌండర్ గా తనదైన ముద్ర వేశాడు. అలాగే పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగ్ తో కళ్ళు చెదిరే క్యాచ్ లు అందుకున్న సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే క్యాన్సర్ తో పోరాడి మళ్ళీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం యువీ కెరీర్ లో కీలకమైన అంశంగా చెప్పొచ్చు. అదే సమయంలో యువరాజ్ సింగ్ ఎఫైర్స్ తో పాటు అతని కెరీర్ లో విలన్ గా కొందరు భావించే ధోనీని ఎలా చూపించబోతున్నారన్న చర్చ జరుగుతోంది.
యువరాజ్ కెరీర్ లో విలన్ ధోనీనే అన్నది చాలా మంది యువీ ఫ్యాన్స్ మాట. టీమిండియాలో ఒక సీనియర్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా ధోని కంటే ముందు.. యువరాజ్ సింగ్‌కు భారత జట్టు కెప్టెన్సీ దక్కాల్సింది. కానీ, కొందరి సూచనలతో ధోనికి జట్టు పగ్గాలు అప్పగించారు. ధోని కెప్టెన్సీలోనే అద్భుతమైన ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిపించాడు. కానీ, వరల్డ్ కప్‌లు గెలిపించిన కెప్టెన్‌గా ధోనికే ఎక్కువ క్రెడిట్ వచ్చింది. పైగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో యువీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. యువీకి దక్కాల్సిన గుర్తింపు దక్కకుండా చేశాడనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ కూడా చాలా సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. మహి స్వార్థపరుడంటూ.. యువీకి దక్కాల్సిన గుర్తింపు దక్కకుండా చేశాడంటూ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో ధోనీ క్యారెక్టర్ ను ఎలా చూపిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.