India Squad: వన్డే ప్రపంచకప్ 2023 కోసం టీమిండియా జట్టును ఇటీవల ప్రకటించింది. ప్రపంచకప్ కోసం ప్రాథమికంగా జట్లను ప్రకటించేందుకు ఆఖరి తేది సెప్టెంబర్ 5. సరిగ్గా సెప్టెంబర్ 5నే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టు నుంచే ఆటగాళ్లను ఎంపిక చేసింది. అయితే ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలను పక్కన పెట్టింది.
బ్యాకప్‌గా ఉన్న సంజూ శామ్సన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. యుజువేంద్ర చహల్‌ను పట్టించుకోలేదు. ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ల ఎంపికపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అర్హత లేకపోయినా ఎంపిక చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారికంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నా సెలెక్టర్లు ఎందుకు పట్టించుకోలేదంటూ విమర్శలు చేస్తున్నారు. కేఎల్ రాహుల్, శార్దుల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ ఎంపికపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. మొదటగా కేఎల్ రాహుల్ విషయానికి వస్తే.. ఏడాది కాలంగా ఫామ్‌లో లేడు. నాలుగు నెలలుగా మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం నుంచి కోలుకున్నా అతడి ఫిట్‌నెస్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. అయినప్పటికీ అతడిని ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక చేయడం హాస్యాస్పదంగా మారింది. పసికూనలపై చెలరేగే రాహుల్.. పెద్ద జట్లపై, కీలక మ్యాచుల్లో చేతులెత్తేయడం కొంత కాలంగా చూస్తున్నాం. ఇక రెండో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. టి20ల్లో సూర్యకుమార్ యాదవ్ తిరుగులేని ప్లేయర్. అయితే వన్డేల్లో మాత్రం అతడు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఆడిన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా లేదు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్ రికార్డును మూటగట్టుకున్నాడు. అయినా కూడా సూర్యకుమార్ యాదవ్‌ను ప్రపంచకప్‌కి ఎంపిక చేశారు. శార్దుల్ ఠాకూర్‌ను ఎందుకు ఎంపిక చేశారో అర్థం కాని పరిస్థితి. ఈసారి ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది. భారత్ పిచ్‌లు పేసర్ల కంటే కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. అయినా కూడా ప్రపంచకప్ కోసం భారత్ ఏకంగా ఐదుగురు పేసర్లను ఎంపిక చేసింది. వీరిలో సిరాజ్, షమీ, బుమ్రా రూపంలో ముగ్గురు పేసర్లు ఉండగా.. హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. శార్దుల్‌ను బౌలింగ్ ఆల్ రౌండర్ అని బీసిసిఐ సమర్థించుకుంటుంది. శార్దుల్ ఠాకూర్ బదులు స్పిన్నింగ్ ఆల్ రౌండర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది. శార్దుల్ ఠాకూర్‌ను లక్కీ బౌలర్ అంటారు. అలా అనడానికి కారణం సెటిల్ అయిన భాగస్వామ్యాలను విడదీస్తుండటమే. అయితే ప్రపంచకప్ కోసం శార్దుల్‌ను ఎంపిక చేయడం ఎందుకనో కరెక్ట్ అనిపించడం లేదు. అతడి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసి ఉంటే స్పిన్నర్‌గా, బ్యాటర్‌గా అక్కరకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు సరైందేనా అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతున్నాయి.