Ishan Kishan: టీమిండియా వన్డే వరల్డ్ కప్ టీమ్‌ను ఇంకా ప్రకటించలేదు. రేపో, మాపో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ వెల్లడించనుంది. ఈ 15 మంది సభ్యులలో ఎవరెవరు ఉంటారన్నది ఇదివరకే ఓ క్లారిటీ కూడా వచ్చింది. ఆసియా కప్‌కు ఎంపికైన జట్టులోని 18 మందిలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణ ఎంపికకారని, మిగిలిన స్థానాలన్నీ ఖాయం అయ్యాయన్న వార్తలు వినపడుతున్నాయి.
అయితే వీరిలోంచి తుది జట్టును ఎలా ఎంపిక చేస్తారన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ విషయంలో భారత్ సందిగ్దంలో పడింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో గంభీర్ మాట్లాడుతూ.. వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ కంటే ఇషాన్ కిషన్‌ను తీసుకోవడమే బెటర్ అని అన్నాడు. ఆటగాళ్ల గత పేరు కంటే పరిస్థితులకు తగ్గట్టు ఆడగలిగే ప్లేయర్ టీమ్‌లో ఉండటం ముఖ్యమని తెలిపాడు.
గంభీర్ స్పందిస్తూ.. ‘వన్డే వరల్డ్ కప్‌లో కెఎల్ రాహుల్ కంటే ఇషాన్ కిషన్‌ను ఆడిస్తేనే బెటర్. ఆటగాడి ఫామ్ కంటే పేరు గొప్పది కదాదు. మీరు ఆటగాళ్ల పేర్లు చూడకండి. వాళ్ల ఆటను చూడండి. విజయాలు తెచ్చిపెట్టే ఆటగాళ్లను ఎంపిక చేసుకోండి. కోహ్లీ, రోహిత్‌లు వరుసగా నాలుగు అర్థసెంచరీలు చేస్తే కెఎల్ రాహుల్ వాళ్లను రీప్లేస్ చేయగలడా..?’ అని ప్రశ్నించాడు. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.