భారత్ తరఫున 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కొన్నాళ్లుగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడంలో విఫలమవుతోన్న ఇషాంత్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడి ఓ మోస్తరుగా రాణించాడీ ఫాస్ట్ బౌలర్. అయితే అతను 2021లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం సిరాజ్, అర్షదీప్, నవదీప్, ఉమ్రాన్ సహా పలువురు ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉన్నారు. కాబట్టి ఇషాంత్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం చాలా తక్కువని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వీటన్నింటి మధ్య భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే సిరీస్‌లో ఇషాంత్ కొత్త అవతారంలో కనిపించనునన్నాడు. టీమిండియా తరఫున ఇషాంత్ మైదానంలో కనిపించకపోయినప్పటికీ, మైదానం వెలుపల కామెంటరీ బాక్స్‌లో వ్యాఖ్యాతగా దర్శనమివ్వనున్నాడు. జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టులో ఇషాంత్ కామెంట్రీ చేయనున్నాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జియో సినిమాలో కామెంట్రీ చేయనున్నాడు. కాగా ప్రస్తుతం ఇషాంత్ శర్మ టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అతను త్వరలో రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కామేంటేటర్ అవతారమెత్తి షాక్ ఇచ్చాడు ఇషాంత్ శర్మ.
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన తర్వాతే కామేంటేటర్లుగా కెరీర్ ప్రారంభిస్తుంటారు. అయితే ఇషాంత్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వకుండా వెస్టిండీస్ సిరీస్‌లో కామెంటేటర్‌గా దర్శనమివ్వనున్నాడు. అంతకుముందు, భారత వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ రిటైర్మెంట్‌కు ముందు పలు సిరీస్‌లలో వ్యాఖ్యాతగా కనిపించాడు. ఇక ఇషాంత్ శర్మ భారత్ తరఫున 105 టెస్టు మ్యాచ్‌ల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు తీశాడు. అలాగే భారత్ తరఫున 14 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 101 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ శర్మ 35.05 సగటుతో 83 వికెట్లు పడగొట్టాడు.