Ishant Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను ఆడిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ సారథని ప్రశంసించాడు. అతని పర్యవేక్షణలోనే తాను అత్యుత్తమ బౌలింగ్ చేశానని గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో భారత పేసర్లు దుమ్మురేపారని తెలిపాడు. పేస్ బౌలర్లకు విరాట్ కోహ్లీ అండగా నిలిచేవాడని చెప్పాడు. విరాట్ కోహ్లీలా కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తిని తాను చూడలేదని ప్రశంసించాడు.
తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాంత్ శర్మ.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘విరాట్ కోహ్లీ సారథ్యంలోనే నా బౌలింగ్ ఎంతో మారింది. అతను ప్రతీ బౌలర్‌ను గొప్పగా అర్థం చేసుకుంటాడు. ప్రతీ ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడేవాడు. ‘మీరు నిలకడగా బౌలింగ్ చేస్తారనే విషయం నాకు తెలుసు. కానీ అంతకుమించిన ప్రదర్శనతో వికెట్లు తీస్తారని ఆశిస్తున్నా’ అని ఎల్లప్పుడూ చెప్పేవాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఫాస్ట్ బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఎందుకంటే ప్రతీ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయగలరని అతను నమ్మేవాడు. ప్రతీ ఒక్కరికి అండగా నిలిచేవాడు. ఎప్పుడూ బ్యాటర్లపై అటాక్ చేయమని చెప్పేవాడు. విఫలమైనా.. పరుగులిచ్చినా అండగా నిలిచి ప్రోత్సహించేవాడు. నేను ఆడిన సారథుల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమం’ అని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు.