Ravi Bishnoi: ఇదే ఐపిఎల్ ఆడితే ఇక్కడే ఉంటా పక్కా ప్లానింగ్ తో రవి బిష్ణోయ్

టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 03:38 PM IST

లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడటం వల్ల తనకు రావాల్సిన గుర్తింపు రావడం లేదని, భారత జట్టులోకి వచ్చే ఆస్కారమే లేకపోయిందనే అసంతృప్తితో బిష్ణోయ్ ఉన్నట్లు తెలుస్తోంది. లక్నో జట్టుకు గుడ్‌బై చెప్పి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీలైతే ట్రేడింగ్ విండో ద్వారా ముంబై జట్టులోకి పోవాలని, లేకుంటే వేలంలోకి రావాలనుకుంటున్నాడని, ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌ కూడా పియూష్ చావ్లా తప్పితే మరో మేటి స్పిన్నర్ లేక ఇబ్బంది పడుతోంది. రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకుంటే టీమ్ బౌలింగ్ విభాగం బలపడే అవకాశం ఉందని ఆ జట్టు భావిస్తోంది.

ఇక ముంబై ఇండియన్స్ కాకపోతే.. ఆర్‌సీబీ జట్టులోకి వెళ్లాలని రవి బిష్ణోయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో జట్టు మారేందుకు రవి బిష్ణోయ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. గత రంజీ సీజన్ వరకు రాజస్థాన్‌కు ఆడిన రవి బిష్ణోయ్ ఇక గుజరాత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. రాజస్థాన్ తరఫున వీలైనన్ని అవకాశాలు రాకపోవడం.. బెంచ్‌కే పరిమితం అవుతుండటంతో బిష్ణోయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022 రంజీ ట్రోఫీ‌లో బిష్ణోయ్ రాజస్థాన్ జట్టు తరఫున ఒకే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. లిస్ట్ – ఎ టోర్నీల్లో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే అతనికి రాజస్థాన్ తరఫున ఆడే అవకాశం దక్కింది. దాంతోనే గుజరాత్‌కు మారుతున్నాడు.

గుజరాత్ అసోసియేషన్ ట్రైనింగ్ కిట్‌తో పాటు ఆ జట్టు జెర్సీని వేసుకున్న ఫొటోను బిష్ణోయ్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. టీమిండియాలో గుజరాత్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత లభిస్తుండటంతోనే రవి బిష్ణోయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే గుజరాత్‌లో ముంబై ఇండియన్స్‌కు చెందిన పియూష్ చావ్లా ఉండటంతో అతని సహకారంతో ముంబై జట్టులోకి వచ్చే ప్రయత్నాలు బిష్ణోయ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.