దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు ముగ్గురు భారత ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ టెస్టు సిరీస్ ఆడట్లేదు. వీరిలో గైక్వాడ్, షమీ గాయాల కారణంగా దూరమైతే.. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండబోనని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతడికి విశ్రాంతినిచ్చారు. అయితే, కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్ల ప్రకారం ఇషాన్ కిషన్ మానసికంగా ఇబ్బంది పడటం వల్లే విరామం తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. వాటిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. వరుసగా మ్యాచ్‌ల కోసం ప్రయాణించడం వల్ల అతడు మానసిక అలసటకు గురైనట్లు సమాచారం.
‘‘మానసికంగా చాలా అలసిపోయినట్లు ఇషాన్ కిషన్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. క్రికెట్ నుంచి కాస్త విరామం కావాలని కోరాడు. టెస్టు సిరీస్ నుంచి తప్పించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అందుకు, మేనేజ్‌మెంట్ అనుమతినిచ్చింది’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది భారత్ ఆడిన ప్రతి సిరీస్‌లోనూ ఇషాన్ జట్టుతోనే ఉన్నాడు. ఎక్కువసార్లు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. వరల్డ్ కప్‌లోనూ తొలి రెండు మ్యాచుల్లో ఆడిన ఇషాన్ .. ఆ తర్వాత బెంచ్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడి స్థానంలో కేఎస్ భరత్‌కు అవకాశం దక్కింది. రుతురాజ్ స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. కాగా, దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 26న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.