Sun Raisers: సన్ రైజర్స్ కెప్టెన్ గా శుభ మాన్ గిల్

టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో గిల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 03:25 PM IST

అన్ని అనుకున్నట్లు జరిగితే ఐపీఎల్ 2024లో శుభ్‌మన్ గిల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది. ఆరెంజ్ ఆర్మీ‌లో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా జట్టును నడిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్లు ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా గిల్‌కు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఆఫర్‌కు శుభ్‌మన్ గిల్ అంగీకరిస్తే ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి అతన్ని తెచ్చుకునేందుకు ఈ రెండు ఫ్రాంచైజీలు సిద్దంగా ఉన్నాయని, అతని కోసం డబ్బులతో పాటు ఇతర ఆటగాళ్లను కూడా వదులుకునేందుకు ఈ రెండు జట్లు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఐపీఎల్ ఫ్రాంచైజీకి సారథ్యం వహించడం ద్వారా టీమిండియా కెప్టెన్‌గా ఎదగవచ్చని గిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉండటం.. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉండటంతో గిల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కొనసాగినా.. సుదీర్ఘ ఫార్మాట్‌లో తాను సారథ్య బాధ్యతలు అందుకోవచ్చనే యోచనలో గిల్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ హార్దిక్ కెప్టెన్‌గా కొనసాగినా అతని డిప్యూటీగానైనా తనకు అవకాశం లభిస్తుందని, ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో వీలైనంత త్వరగా కెప్టెన్ కావాలనే ఉద్దేశంతో గిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో శుభ్‌మన్ గిల్ అసాధారణ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. 17 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 890 పరుగులు చేసిన గిల్.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.