OYO Rooms: 500 కొత్త హోటళ్లు ఓయో సంచలన నిర్ణయం

వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో అక్టోబర్ - నవంబర్ లో ప్రపంచకప్ మ్యాచులు జరుగబోయే నగరాల్లో హోటల్ రూమ్ రెంట్స్ కొండెక్కుతున్న వేళ ఆతిథ్య రంగంలో సంచలనాలు నమోదుచేస్తున్న ‘ఓయో’.. క్రికెట్ అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పింది.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 02:45 PM IST

భారత్ – పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే మ్యాచ్ కు గాను అక్కడి హోటల్స్ లో గదులు అద్దెకు కావాలంటే రోజుకు రూ. 70 వేల నుంచి లక్ష రూపాయలు వెచ్చించినా దొరకడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడు నెలల్లో ప్రపంచకప్ జరుగబోయే పది నగరాలలో ఏకంగా 500 కొత్త హోటల్స్ ను తెరవనుంది. ఈ మేరకు ఓయో ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘రాబోయే మూడు నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరుగబోయే పది నగరాలలో 500 కొత్త హోటల్స్ ను తెరవబోతున్నాం.

ప్రపంచకప్ మ్యాచులను లైవ్ గా చూసేందుకు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వారికి అందుబాటు ధరల్లో ఉండే విధంగా వసతులు కల్పించేందుకు ఓయో సిద్ధమవుతుంది..’ అని తెలిపాడు. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో.. గతంలో అహ్మదాబాద్ లోని స్టార్ హోటల్స్ లో రోజుకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకూ ఉన్న గదుల అద్దెలు మ్యాచ్ నాటికి ఏకంగా రోజుకు లక్ష రూపాయలు ఇచ్చి బుక్ చేసుకుందామాన్నా దొరకడం లేదు. ఐటీసీతో పాటు ప్రముఖ హోటల్స్ లో అక్టోబర్ లో రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినట్టు సమాచారం. హై ఫై హోటల్స్ లోనే గాక నార్మల్ స్టేయింగ్ హోటల్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ లో కూడా అద్దెలు కాక రేపుతున్నాయి.

రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు వరకు ఛార్జ్ చేసే హోటల్స్ కూడా అక్టోబర్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నవారికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా వసూలు చేస్తున్నాయి. మిగతా హోటల్స్ తో పోలిస్తే ఓయో ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. మరి రాబోయే వన్డే వరల్డ్ కప్ లో ఓయో.. క్రికెట్ అభిమానులకు ఎలాంటి వసతులు కల్పిస్తుందో వేచి చూడాలి.