Angelo Mathews: ఇలాంటి ఆటగాళ్ళను ఎప్పుడూ చూడలేదు: ఏంజెలో మాథ్యూస్‌

నేను తప్పు చేయలేదు. బ్యాటింగ్‌ కోసం రెండు నిమిషాలకు ముందే సిద్ధమయ్యా. హెల్మెట్ సరిగా లేని విషయం బంగ్లా ఆటగాళ్లకు, అంపైర్లకు చెప్పా. వారి కామన్‌సెన్స్‌ ఏమైందో. కెప్టెన్ షకిబ్‌, బంగ్లా జట్టు నుంచి అవమానకర ప్రతిస్పందన వచ్చింది.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 05:48 PM IST

Angelo Mathews: శ్రీలంక సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ (Angelo Mathews) బంగ్లాదేశ్‌ జట్టుపై మండిపడ్డాడు. తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదన్నాడు. బంగ్లా ఆటగాళ్ల కామన్‌సెన్స్‌ ఎలాంటిదో మరోసారి ఋజువైందన్నాడు. తనకు ఇంకా సమయం ఉన్నా టైమ్ ఔట్‌గా ప్రకటించారని, వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాథ్యూస్‌ టైమ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి వచ్చి గార్డ్‌ తీసుకోకుండానే.. హెల్మెట్‌ కోసం వేచి చూశాడు.

దీంతో బంగ్లాదేశ్ (Bangladesh) కెప్టెన్‌ షకిబ్‌ హల్ హాసన్ (Shakib Al Hasan).. ఔట్‌ కోసం అప్పీలు చేయగా.. అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో మాథ్యూస్‌ డగౌట్‌కు వెళ్లిపోయాడు. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏంజెలో మాథ్యూస్‌ తీవ్ర విమర్శలు గుప్పించాడు. “నేను తప్పు చేయలేదు. బ్యాటింగ్‌ కోసం రెండు నిమిషాలకు ముందే సిద్ధమయ్యా. హెల్మెట్ సరిగా లేని విషయం బంగ్లా ఆటగాళ్లకు, అంపైర్లకు చెప్పా. వారి కామన్‌సెన్స్‌ ఏమైందో. కెప్టెన్ షకిబ్‌, బంగ్లా జట్టు నుంచి అవమానకర ప్రతిస్పందన వచ్చింది. బంగ్లా ఇదే విధంగా క్రికెట్‌ ఆడాలనుకుంటే.. ఆ స్థాయికి దిగిపోండి. ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. నేను రెండు నిమిషాల్లోపు బ్యాటింగ్‌ కోసం సిద్ధంగా ఉండకపోతే.. ఔటని నిబంధనలలో ఉంది. నాకు ఇంకా ఐదు సెకన్ల సమయం ఉంది. నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి” అని మాథ్యూస్ స్పందించాడు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడంపై ఏంజెలో మాథ్యూస్‌ స్పందిస్తూ… ‘కరచాలనం చేసుకోకపోవడం పెద్ద విషయం కాదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. మీరు ఇతరుల నుంచి గౌరవం పొందాలనుకుంటే.. ముందు మీరు కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలి. ఇతరులకు గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించినప్పుడు.. మీరేం అది అడగలేరు కదా?. బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌, ఆ జట్టు పట్ల ఉన్న గౌరవం ఇప్పుడు పోయింది’ అని పేర్కొన్నాడు.