టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద లక్ష్యాలతో తన ప్రస్థానాన్ని మొదలుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇప్పటి నుంచే కోర్ టీమ్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జట్టులో ఉన్న పలువురు ఆటగాళ్ళకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ జాబితాలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ముందు వరుసలో ఉన్నాడు. చాలా సందర్భాల్లో సంజూకు అన్యాయం జరుగుతూనే ఉండగా.. ఇప్పుడు సహచరుల పోటీతో జట్టులో ప్లేస్ కూడా సందిగ్ధంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే వన్డే, టెస్ట్ జట్టులో అతన్ని మళ్ళీ చూసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే రిషబ్ పంత్ రెగ్యులర్ కీపర్ గా జట్టులో ఉండడం.. అతని వారసునిగా సెలక్టర్లు యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ పై ఫోకస్ చేయడమే దీనికి కారణం.
ప్రస్తుతం వన్డే జట్టులో పంత్ కు తోడు స్టాండ్ బై కీపర్ గా కెఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. అయితే తర్వాతి ఆప్షన్ గా గతంలో సంజూ పేరే ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ధృవ్ జురెల్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన జురెల్ అంతర్జాతీయ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించాడు. పంత్ లేకపోవడంతో ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసిన ఈ యువ వికెట్ కీపర్ ఆకట్టుకున్నాడు. కీపర్ గానే కాకుండా బ్యాటర్ గానూ రాణించాడు. దీంతో ప్రస్తుతం పంత్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ తో పాటు వన్డేల్లోనూ జురెల్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు కాకున్నా వచ్చే రెండేళ్ళలో అతన్ని తీర్చిదిద్దే అవకాశముంది. అదే జరిగితే వన్డేల్లోనూ ఇక సంజూ శాంసన్ కు చోటు దక్కడం కష్టమే.