ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఈ డైలాగ్ వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది. నిజానికి ఐపీఎల్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి పరుగుల వరద పారించిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. మెగా టోర్నీకి ముందు అతని సూపర్ ఫామ్ తో చెలరేగడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇక వరల్డ్ కప్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే జాతీయ జట్టుకు ఆడేటప్పుడు కోహ్లీ రెగ్యులర్ గా వన్ డౌన్ లో వస్తాడు.
వరల్డ్ కప్ లో మాత్రం ద్రావిడ్ విరాట్ ను ఓపెనర్ గా పంపాడు. సెమీస్ వరకూ ఒక్క మ్యాచ్ లోనూ కోహ్లీ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దాదాపు అన్ని మ్యాచ్ లలోనూ పవర్ ప్లేలోనే ఔటయ్యాడు. 7 మ్యాచ్ లలో కోహ్లీ చేసింది 75 పరుగులే.. అయితే కోహ్లీపై కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి నమ్మకముంచాడు. ఫైనల్లో అతని మెరుపులు చూడొచ్చంటూ ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చాడు.
దీనిని నిలబెట్టుకుంటూ కోహ్లీ ఫైనల్లో అదరగొట్టేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ కు విలువ ఉంటుందన్న మాటను నిజం చేస్తూ అక్షర్ పటేల్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పాడు. భారత్ మంచి స్కోర్ చేయడానికి కోహ్లీ ఇన్నింగ్సే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫైనల్లో కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. టోర్నీ మొత్తం విఫలమైనా టైటిల్ పోరులో అదరగొట్టిన కోహ్లీ వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అందుకేగా నిన్ను కింగ్ కోహ్లీ అనేది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.