టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. క్రికెట్ కెరీర్ లో రిటైర్మెంట్ కు చేరువలో ఉన్న జడ్డూ బీజేపీలో చేరాడు. బిజెపీలో చేరిన ఫోటోలను, మెంబర్ షిప్ కార్డును జడేజా భార్య రివాబా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పటికే జడేజా భార్య రివాబా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో బిజేపీ తీర్థం పుచ్చుకున్న రివాబా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల సమయంలో భార్య రివాబా తరపున జడ్డూ ప్రచారం చేశాడు. భారత క్రికెట్ టీమ్ లో సీనియర్ ఆల్ రౌండర్ గా ఉన్న జడేజా ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
దేశవాళీ క్రికెట్ లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకూ భారత్ తరపున 72 టెస్టులు , 197 వన్డేలతో పాటు 74టీ ట్వంటీలు ఆడాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పొలిటికల్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు.