ఏ ఫార్మాట్ లోనైనా ఆల్ రౌండర్ కు చాలా గుర్తింపు ఉంటుంది. ఈ కేటగిరీలో భారత్ నుంచి చాలా కాలంగా అదరగొడుతున్నది ఎవరంటే రవీంద్ర జడేజా అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అన్ని ఫార్మాట్ లలోనూ దుమ్మురేపుతున్న జడేజా టెస్టుల్లో టాప్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత WTC ఛాంపియన్ షిప్ లో జడ్డూ జోరుకు అడ్డే లేకుండా పోయింది. ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన జడ్డూ భాయ్.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన జడ్డూ.. తర్వాత బంతితోనూ విజృంభించాడు. టెస్ట్‌ల్లో పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా రాటుదేలిన జడేజా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Champion) లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందుకు అతని గణాంకాలే సాక్ష్యం. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన జడేజా బ్యాటింగ్‌లో 49.95 సగటున 1520 పరుగులు చేసి బౌలింగ్‌లో 25.08 సగటున 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ఈ టోర్నీలో జడ్డూ మూడు సెంచరీలు, 10 అర్దసెంచరీలు బాదాడు. ప్రస్తుత WTC సైకిల్ విషయానికొస్తే.. జడేజా ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, రెండు అర్దసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 19 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.