HCA President: జనరల్ ఎన్నికల రేంజ్ టెన్షన్ పెట్టాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు. హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై.. ఒక్క ఓటు తేడాతో జగన్ విజయం సాధించారు. ముందుగా వచ్చిన ఫలితాలపై అమర్నాథ్ అనుమానం వ్యక్తం చేయగా.. రీకౌంటింగ్ నిర్వహించారు. అందులోనూ ఒక్కఓటుతో జగన్ విక్టరీ కొట్టివేశారు.
మొత్తం 173 ఓట్లు ఉండగా 169 ఓట్లు పోల్ అయ్యాయ్. ఈ ఎన్నికల్లో మాజీ క్రికెటర్లు వెంకటపతి రాజు, వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, మిథాలీ రాజ్, స్రవంతి నాయుడు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగన్‌మోహన్‌రావుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఫలితాలు ప్రకటించగానే జగన్మోహన్ మద్దతుదారులు స్టేడియం దగ్గర సంబరాలు చేసుకున్నారు. జగన్మోహన్ రావు ప్రస్తుతం హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఉన్నారు. ఆరుగురు సభ్యులతో కొత్త HCA ప్యానెల్ ఎన్నికైంది. జగన్‌మోహన్ రావు కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాగా.. గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కు చెందిన దల్జిత్ సింగ్ వైస్‌ప్రెసిడెంట్‌గా సెలక్ట్ అయ్యారు.
క్రికెట్ ఫస్ట్ ప్యానెల్‌కు చెందిన దేవరాజు సెక్రటరీగా.. గుడ్‌గవర్నెన్స్ ప్యానెల్‌కు చెందిన బసవరాజు జాయింట్ సెక్రెటరీగా.. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్‌కు చెందిన పీజే శ్రీనివాసరావు ట్రెజరర్‌గా.. క్రికెట్ ఫస్ట్ ప్యానెల్‌కు చెందిన సునీల్ అగర్వాల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఉప్పల్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో హెచ్‌సీఎ ఎన్నికలు జరిగాయి.