Bhumra: మూడు టీ20 మ్యాచులు కెప్టెన్ గా బుమ్రా

వెస్టిండీస్ పర్యటన అనంతరం ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 12:31 PM IST

భారత జట్టుకు బీసీసీఐ సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను నియమించారు. వెన్ను గాయంతో దాదాపు 11 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను కెప్టెన్‌ గా ఎంపిక చేశారు. హార్దిక్‌ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో.. యువ ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో సొంతగడ్డపై చివరిగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో జస్ప్రీత్‌ బుమ్రా ఆడాడు. ఆ తర్వాత వెన్ను గాయంతో మైదానానికి దూరమయ్యాడు. శస్త్ర చికిత్స అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకున్న బుమ్రా.. ఇటీవలే సాధన మొదలు పెట్టాడు. ఫిట్‌నెస్‌ సాధించిన అతడు ఏకంగా టీమిండియాకు కెప్టెన్‌ అయ్యాడు.

గాయాల నుంచి కోలుకోని స్టార్ బ్యాటర్స్ కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లకు జట్టులో చోటు దక్కలేదు. గాయంతో చాలా రోజులుగా జట్టుకు దూరమై ఎన్‌సీఏలో కోలుకున్న పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ 2023లో సత్తాచాటిన శివమ్‌ దూబె కూడా చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌ 2023లో పరుగుల వరద పారించిన రింకు సింగ్‌, జితేశ్‌ శర్మలు తొలిసారి భారత జట్టులోకి వచ్చారు. ఇక వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మలకు కూడా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడే జట్టులో చోటు దక్కింది.