Jasprit Bumrah: పదేళ్ల తర్వాత ఇంటి వద్ద వేసవి కాలాన్ని గడిపానని టీమ్ ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. సుదీర్ఘకాలం క్రికెట్‌కు దూరమవ్వడాన్ని నెగెటివ్‌గా తీసుకోలేదన్నాడు. తానిప్పుడు సేదతీరానని ఆటను ఆస్వాదించేందుకే వచ్చానని వెల్లడించాడు. తన నుంచి ఎక్కువగా ఆశించొద్దని స్పష్టం చేశాడు. తనపై అంచనాలు పెట్టుకోవడం ఇతరుల సమస్యగా వర్ణించాడు. ‘నేనేమీ వెనక్కి తగ్గలేదు. ఎప్పట్లాగే బంతులు విసురుతున్నా. నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. చాలాసార్లు నెట్ ప్రాక్టీస్ చేశాను.
టీమ్ ఇండియాతో డబ్లిన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడ బౌలింగ్‌ను ఇంకాస్త ఎక్కువే ఎంజాయ్ చేయొచ్చు. నా బాడీ చాలా బాగుంది. ఎక్కువ మ్యాచులు ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని బుమ్రా అన్నాడు. వన్డేలనే దృష్టిలో పెట్టుకొని పది ఓవర్లు వేయడమే లక్ష్యంగా సాధన చేశాను. రోజుకు 10, 12, 15 ఓవర్ల వరకు విసిరాను. అందుకే ఐర్లాండ్‌లో అంతకన్నా తక్కువ ఓవర్లు వేయడం చాలా సులభం’ అని బుమ్రా అన్నాడు. ‘జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా బౌలింగ్ ట్రంప్ కార్డు అనుకోవడం గొప్ప గౌరవం. మంచైనా.. చెడైనా దీనిని నేను గౌరవిస్తాను. అయితే ఎక్కువ సీరియస్‌గా తీసుకోను. నాపై అంచనాల భారం, ఒత్తిడిని ఉంచుకోను. ఆటను ఎంజాయ్ చేయడానికే పునరాగమనం చేస్తున్నాను’ అని బుమ్రా తెలిపాడు.