Jemimah Rodrigues: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్ 2023 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన టీమిండియా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన 46, జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులతో రాణించారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ విజయం సాధించింది.
భారత యువ పేసర్ టిటాస్ సాధు 3 వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బ తీసింది. ఆసియా గేమ్స్ 2023లో జెమీమా రోడ్రిగ్స్ టాప్ స్కోరర్. మూడు మ్యాచుల్లో జెమీమా 109 పరుగులు చేసింది. ఫైనల్‌లో కీలక సమయంలో 42 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ సాధించేందుకు దోహదపడింది. గోల్డ్ మెడల్ అందుకున్న తర్వాత జెమీమా మాట్లాడుతూ భారత పురుషుల జట్టుకూ ఓ సందేశం పంపింది. “ఇక మనం భారత పురుషుల క్రికెట్ జట్టు గురించి మాట్లాడుదాం. వారికి ఒకటే విజ్ఞప్తి.. మేం స్వర్ణం గెలిచాం, ఇక మీ వంతు. మీరు కూడా ఆసియా గేమ్స్ 2023లో గోల్డ్ మెడల్ సాధించాలి” అని జెమీమా అభినందనలు తెలిపింది.
పోడియంపై భారత జెండా ఎగరటంపై జెమీమా హర్షం వ్యక్తం చేసింది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అక్టోబర్ 3న ఈ మ్యాచ్ జరగనుంది.